తానూర్, జూలై 30 : చెట్లతోనే మానవ మనుగడ ఆధారపడి ఉందని నిర్మల్ జిల్లా అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే పేర్కొన్నారు. తానూర్ మండలం బోంద్రట్ గ్రామాన్ని శనివారం ఆయన సందర్శించారు. జాతీయ రహదారి ఇరుపక్కల నాటిన మల్టీ లేయర్ అవెన్యూ ప్లాంటేషన్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ రహదారుల వెంట నాటిన మొక్కలు సంరక్షించాలని, కంచె ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.
నాటిన చోట మొక్క ఎండిపోతే అదేస్థానంలో కొత్తవి నాటాలని ఆదేశించారు. మొక్కలు ఎండిపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామాల్లో సీజనల్ వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేయాలని, పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఆయన వెంట బోసి సర్పంచ్ శివరాత్రే ఆనంద్, బోంద్రట్ సర్పంచ్ మందాకిని, మండల అభివృద్ధి అధికారి గోపాలకృష్ణారెడ్డి, ఎంపీవో మన్మోహన్సింగ్, పంచాయతీ కార్యదర్శి జయశ్రీ, నాయకుడు కేశవ్ ఉన్నారు.
భైంసాటౌన్, జూలై, 30 : భైంసా మండలం మాటేగాం గ్రామంలో జాతీయ రహదారి పక్కన మల్టీ లెవల్ ప్లాంటేషన్‌ను అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాటిన మొక్కలకు ప్రతి రోజూ నీరు పట్టాలని సూచించారు. రోడ్డు పక్కన గుంతలు ఉంటే గ్రావెల్‌తో పూడ్చాలని ఆదేశించారు. ఆయన వెంట ఎంపీడీవో గంగాధర్, ఎంపీవో మోజామ్ హుస్సేన్, పంచాయతీ కార్యదర్శి సరస్వతి ఉన్నారు.
విద్యార్థులను
దిలావర్పూర్, జూలై 30 : ప్రభుత్వ వసతి గృహాలు, కస్తూర్బాగాంధీ విద్యాలయాల్లో చదువుకునే విద్యార్థులను కుటుంబ సభ్యుల్లా భావించి వారికి నాణ్యమైన విద్యతో పాటు రుచికరమైన భోజనం అందించాలని అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే అన్నారు. మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయాన్ని ఆయన సందర్శించారు. తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో ముచ్చటించారు.
భోజనం వివరాలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో నెలకొన్న పరిస్థితుల గురించి ప్రిన్సిపాల్ అపర్ణ ఇటీవల మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. రెండు రోజుల నుంచి గ్రామ పంచాయతీ నిధులతో చేపడుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం విద్య, వైద్య రంగంపై దృష్టి సారించినందున వసతి గృహంలో ఉండే విద్యార్థులపై జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఆయన వెంట సర్పంచ్ విరేశ్కుమార్, ఎంపీపీ పాల్దే అక్షరాఅనిల్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి మోహన్, ఎంపీవో అజీజ్‌ఖాన్, ప్రిన్సిపాల్ అపర్ణ ఉన్నారు.