వ్యవసాయ కుటుంబ నేపథ్యం కలిగిన ఆ వ్యవసాయాధికారి రైతులకు మేలు చేసే సరికొత్త యంత్రాన్ని ఆవిష్కరించాడు. పత్తి, సోయా విత్తనాలు నాటే పనుల్లో కూలీల కొరత సమస్యకు పరిష్కారం చూపాడు. ఆదిలాబాద్ జిల్లా వ్యవసాయ శాఖ జేడీ కార్యాలయంలో ఏవో (టెక్నికల్)గా విధులు నిర్వర్తిస్తున్న ఏనుగు శ్రీనివాస్‌రెడ్డి కుటుంబానికి తలమడుగు, భీంపూర్ మండలాల్లో వ్యవసాయ భూమి ఉంది.
ఏటా సీజన్లో సోయా, పత్తి విత్తనాలు వేసే క్రమంలో కూలీల కొరత, సమయం ఎక్కువ పడుతుండడం సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో ట్రాక్టర్ ద్వారా సోయా విత్తనాలు వేసే పరికరాలు తయారు చేయించాడు. చేలల్లో ప్రయోగం కూడా చేసి రైతులకు చూపించాడు. సాధారణంగా సోయా విత్తనాలు ఒక రోజులో ఎకరానికి మించి వేయలేరు. అదే కొత్త పరికరంతో గంటకు 3 ఎకరాల్లో విత్తనాలు వేసే వీలుంది.
విత్తనం నష్ట పోకుండా విత్తనం, సాళ్ల మధ్య సరైన లైనింగ్ వస్తున్నది. ట్రాక్టర్ యంత్రం ద్వారా రోజుకి 100 ఎకరాల్లో పత్తి విత్తనాలు వేయొచ్చని శ్రీనివాస్‌రెడ్డి చెప్తున్నాడు. తమ కుటుంబానికే కాదు తోటి రైతులకూ ప్రయోజనకరంగా ఉన్న ఈ సోయింగ్ యంత్రం స్థానికంగా చర్చనీయాంశమైంది.
– ఆదిలాబాద్, ఫొటోగ్రాఫర్, జూలై 30