బోథ్, జూలై 30 : ఓటరుగా నమోదై ఉన్న ప్రతి ఒక్కరికీ ఆధార్ లింక్ చేయాలని తహసీల్దార్ అతిఖొద్దీన్ సూచించారు. మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో శనివారం బూత్ లెవల్ అధికారులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2023 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండనున్న వారిని ఓటర్లుగా నమోదు చేయాలన్నారు.
ఫాం-6 ద్వారా కొత్త ఓటరు, ఫాం-6(బీ) ద్వారా ఆధార్లింకు, ఫాం-7 ద్వారా మరణించిన వారి వివరాలు తొలగించడం, మార్పులు, ఫాం-8 ద్వారా పేర్ల సవరణ, తప్పులు వంటివి చేయాలన్నారు. సమావేశంలో డిప్యూటీ తహసీల్దార్ రాథోడ్ ప్రకాశ్, ఎన్నికల విభాగం డీటీ సూరజ్రావు, సీనియర్ అసిస్టెంట్ వెంకట్రావ్, ఆర్ఐలు దశరథ్, సునీత, బీఎల్వోలు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
సిరికొండ, జూలై 30 : 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటరు జాబితాలో చోటు కల్పిస్తూ సమగ్రంగా జాబితా రూపొందించాలని నాయబ్ తహసీల్దార్ జాదవ్ శంకర్ బీఎల్వోలకు సూచించారు. మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయంలో శనివారం బీఎల్వోలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో 18 ఏళ్ల నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలని అన్నారు.
ఓటరు జాబితా గరుడయాప్లో నమోదు చేయాలని సూచించారు. ఫారం -6లో నూతన ఓటరు నమోదు మాత్రమే ఉంటుందన్నారు. ఓటర్ల జాబితాలోని పొరపాట్లను పూర్తి స్థాయిలో సవరించాలన్నారు. 2023 జనవరి 5వ తేదీ వరకు ఓటరు జాబితా రూపొందించి సమగ్రంగా తయారు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్ఐలు యుజ్వేందర్ రెడ్డి, ఉమాదేవి, తదితరులు పాల్గొన్నారు.
నేరడిగొండ, జూలై 30 : 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటుహక్కు కల్పించేలా నమోదు చేయాలని తహసీల్దార్ పవన్చంద్ర బీఎల్వోలకు సూచించారు. మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గరుడ యాప్ ఆధారంగా ఓటరు ఐడీ నమోదు చేసే విషయంపై అవగాహన కల్పించారు. పలు అంశాలపై వివరించారు. కార్యక్రమంలో ఎంపీపీ రాథోడ్ సజన్ పాల్గొన్నారు.
జైనథ్, జూలై 30 : రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు గరుడ యాప్లో ఓటరు ప్రక్రియను నమోదు చేయాలని తహసీల్దార్ రాఘవేంద్రరావు బీఎల్వోలకు సూచించారు. మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయంలో బీఎల్వోలకు గరుడ యాప్ నిర్వహణపై అవగాహన కల్పించారు. ఈ విషయంపై సర్పంచ్లు, ఎంపీటీసీలకు తెలియజేశామని తెలిపారు. కార్యక్రమంలో డీడీ రాజేశ్వరీ, ఆర్ఐలు నితిన్, రాందాస్ పాల్గొన్నారు.