నార్నూర్, జూలై 30 : మండల కేంద్రంలోని ఎస్సీ వసతి గృహం వాచ్‌మన్ మద్యం మత్తులో విద్యార్థులను చిదకబాదినట్లు అధికారులకు ఫిర్యాదులు అందాయి. శుక్రవారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో విద్యార్థులు అల్లరి చేశారని జావీద్ అనే వాచ్మెన్ కే.జ్ఞానేశ్వర్, జీ.కానుసింగ్, శ్రీనివాస్, జీ.వాగ్మారే రామేశ్వర్ అనే విద్యార్థులను కర్రతో చితక బాదాడు.
విద్యార్థుల కేకలు విన్న మండల కేంద్రానికి చెందిన యువకులు వసతి గృహానికి వెళ్లి వాచ్‌మెన్‌ను నిలదీశారు. మద్యం మత్తులో ఇష్టారీతీన మాట్లాడడంతో వార్డెన్ రవికి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. విద్యార్థులు సైతం వాచ్మెన్ పనితీరును రాతపూర్వకంగా వార్డెన్‌కు అందజేశారు. ఈ విషయాన్ని డీడీ సునీతకు నివేదిస్తామని వార్డెన్ చెప్పగా.. విచారణ చేపట్టి శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని డీడీ తెలిపారు.