పెంచికల్పేట్ , జూలై 26 : ఉద్యోగులు సమయపాలన పాటించకుంటే చర్యలు తప్పవని కుమ్రం భీం ఆసిఫాబాద్ అదనపు కలెక్టర్ చాహత్ బాజ్పాయి హెచ్చరించారు. మండలంలోని పలు గ్రామాల్లో ఆమె మంగళవారం పర్యటించారు. ఎర్రగుంట,అగర్గూడకు సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో పంచాయతీ ట్రాక్టర్ ద్వారా ఆమా గ్రామాలకు వెళ్లారు.
బొంబాయిగూడ, ఎల్కపల్లి, పెంచికల్పేట్లో పరిశుభ్రతపై గ్రామస్తులను అడిగి తెలుసుకుకన్నారు. రోడ్డుపై నీరు నిల్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. మండల కేంద్రంలోని ప్రాథమిక, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు గణితం బోధించారు. విద్యార్థులు లెక్కలు చేయకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు.
ఉపాధ్యాయులను మందలించారు. ముగ్గురు ఉపాధ్యాయులు గైర్హాజరు కావడంపై సీనియర్ ఉపాధ్యాయుడు యాదగిరిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఒకరు కాంప్లెక్స్ మీటింగ్ వెళ్లారని, ఇద్దరు సెలవులో ఉన్నారని తెలిపారు. ఇద్దరి సెలవుపత్రాలు చూపించమని అడగడంతో సరైన సమాచారం, సమాధానం ఇవ్వకపోడంతో వారికి షోకాజ్ నోటీసుల జారీకి ఆదేశించారు. కేజీబీవీ పాఠశాలలో విద్యార్థులు ఇంగ్లిష్లో సమాధానాలు ఇవ్వడంతో సంతృప్తి వ్యక్తం చేశారు.
అనంతరం రైతు వేదికలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో చిరుధాన్యాలతో పౌష్టికాహారం తయారీ కార్యక్రమానికి హాజరయ్యారు. అంగన్వాడీ సిబ్బంది చేసిన వంటలను రుచిచూసి ఆనందం వ్యక్తం చేశారు. ఆమె వెంట ఎంపీడీవో గంగాసింగ్, మండల కోఆప్షన్ సభ్యుడు సాజిద్, సర్పంచ్లు కావ్య, కళావతి, చంద్రమౌళి, రాజన్న, సుధాకర్, ఉపాధ్యాయుడు శ్రీధర్, కార్యదర్శులు, నాయకులు ఉన్నారు.