వైద్యారోగ్య శాఖలోని కీలకమైన కార్యకలాపాలను ఇకపై ఆన్లైన్ చేయాలని సర్కారు నిర్ణయించింది. ఇప్పటికే కొన్ని అంశాలను ప్రత్యేక పోర్టల్‌లో నమోదు చేస్తుండగా, మరో 21 అంశాలను కూడా పొందుపరిచేందుకు సిద్ధమవుతున్నది. ఇప్పటికే ఆశ కార్యకర్తలకు స్మార్ట్ ఫోన్లు అందించగా, ఇక క్షేత్రస్థాయిలో సేవలు అందిస్తున్న ఏఎన్ఎంలకు 4-జీ సిమ్‌లు ఇవ్వడంతో పాటు ట్యాబ్‌లు, మినీ ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేయనున్నది. ఈ విధానంతో పనిభారం తగ్గనుండగా, సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
నిర్మల్, జూన్ 21(నమస్తే తెలంగాణ) : కొవిడ్ కష్టకాలంలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సేవలతో మన్ననలు అందుకున్న ఏఎన్ఎంలకు పని భారాన్ని తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. జిల్లాలో మొత్తం 16 పీహెచ్‌సీలు, 3 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లతో పాటు జిల్లా దవాఖాన ఉండగా, మరో 3 అర్బన్ హెల్త్ సెంటర్లు ఉన్నాయి. అలాగే 106 సబ్ సెంటర్లు కూడా కొనసాగుతున్నాయి. ఆయా సెంటర్లలో పని చేసే ఏఎన్ఎంలు, ఇతర ఆరోగ్య సిబ్బంది ఇప్పటి వరకు 21 రకాల రికార్డులను నిర్వహిస్తూ వస్తున్నారు.
వీరికి పేపర్‌లెస్ వర్క్ అందుబాటులోకి తీసుకువస్తే ఆయా రికార్డులు ఇక సులువుగా ఆన్లైన్ కానున్నాయి. క్షేత్రస్థాయిలో పని చేసే ఏఎన్ఎంలు ఇన్ని రికార్డులను మోయడం తలకు మించిన భారంలా మారిన విషయం తెలిసిందే. ఇప్పటికే కొన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయి పనులను కూడా గ్రామీణ స్థాయిలో చేయాల్సి వస్తుండడం వారికి ఇబ్బందిగా మారింది. మాతా శిశు సంరక్షణ సేవలు, వ్యాక్సినేషన్, అంటువ్యాధులు, ఓపీ సేవల వంటి కార్యక్రమాలతోపాటు కొవిడ్ సేవలు, జాతీయ అసంక్రమిత వ్యాధుల (ఎన్సీడీ) నివారణ చర్యలు, జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలువంటి కొన్ని కొత్త ఆరోగ్య కార్యక్రమాల బాధ్యత ఏఎన్ఎంలపైనే పడింది.
దీంతో వీరిపై పడుతున్న అదనపు భారాన్ని తగ్గించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం… ఏఎన్ఎంలకు 4జీ సిమ్ కార్డులు, ట్యాబ్‌లు, మినీ ల్యాప్‌టాప్‌లను అందజేయాలని భావిస్తున్నది. ఇప్పటికే ట్యాబ్‌లను అందజేసిన ప్రభుత్వం ఇంటర్నెట్ సేవల్లో కలుగుతున్న అంతరాయాన్ని దృష్టిలో ఉంచుకొని 4జీ నెట్వర్క్ సిమ్ కార్డులను అందజేయాలని నిర్ణయించింది. అలాగే 4జీ సిమ్ సపోర్ట్ చేసే ట్యాబ్‌లు, మినీ ల్యాప్‌టాప్‌లను కూడా అందజేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. పేపర్ లెస్‌గా మార్చే ప్రయత్నంలో భాగంగా ఏఎన్ఎంలకు సరళమైన భాష అర్థమయ్యే రీతిలో 21 వరకు ఉన్న రికార్డులను యాప్ రూపంలో ఇవ్వాలని, వాటి ఆధారంగా ఇకపై ట్యాబ్లలోనే సేవలు నిక్షిప్తం చేసే చర్యలు తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఉద్యోగులకు అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తున్నది. త్వరలోనే కొత్త ట్యాబ్‌లు, మినీ ల్యాప్‌టాప్‌లను ఇస్తారని అధికారులు చెప్పారు. వీటితో తమకు పనిభారం తగ్గుతుంది. ప్రతి రోజూ గ్రామాలకు వెళ్లేటప్పుడు వ్యాక్సిన్ క్యారియర్, మందుల కిట్టు మొదలగు వాటితో పాటు అదనంగా టూర్ డైరీ, ఇతర రికార్డులను వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆన్లైన్ విధానం వల్ల ఈ రికార్డుల భారం తప్పుతుంది. అలాగే ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని పంపే అవకాశం ఉంటుంది.
– సుజాత, ఏఎన్ఎం, నిర్మల్
వైద్యారోగ్య శాఖలో ఏఎన్ఎంల సేవ లు కీలకంగా మారాయి. క్షేత్రస్థా యిలో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నారు. కొవిడ్ కాలంలో వారు చేసిన సేవలకు తగిన గుర్తిం పు లభించింది. ప్రస్తుతం వారిపై ఉన్న పని భారం తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నాం. త్వరలోనే 4జీ సిమ్ కార్డులను పంపిణీ చేస్తాం. అలాగే ఆశ కార్యకర్తల మాదిరిగానే ఏఎన్ఎంలకు కూడా ట్యాబ్‌లు, మినీ ల్యాప్‌టాప్‌లను అందజేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
– ధన్‌రాజ్, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి, నిర్మల్