జైనూర్, జూన్ 20 : ప్రధానోపాధ్యాయులు, ఎస్ఎంసీ చైర్మన్లు, కమిటీ సభ్యులు సమన్వయంతో పని చేస్తూ పాఠశాలల అభివృద్ధికి పాటుపడాలని అదనపు కలెక్టర్ ఛాహత్ బాజ్పాయి సూచించారు.మండలకేంద్రంలోని బాలికల ఆశ్రమ పాఠశాలలో సోమవారం నిర్వహించిన జైనూర్, సిర్పూర్-(యూ), లింగాపూర్, కెరమెరి మండలాల ప్రధానోపాధ్యాయులు, ఎస్ఎంసీ చైర్మన్ల శిక్షణ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
సర్కారు బడుల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ‘మన ఊరు -మన బడి’ కార్యక్రమాన్ని చేపట్టిందని. ఇందులోభాగంగా చేపడుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలని సూచించారు.అదేవిధంగా ఇంగ్లిష్ మీడియం ప్రారంభించిందని, ఇందులో ప్రవేశాలు పెంచాలని సూచించారు. సమావేశంలో జిల్లా విద్యాధికారి అశోక్, సెక్టోరల్ అధికారి భరత్, సత్యనారాయణ మూర్తి, మండల విద్యాధికారి కుడ్మెత సుధాకర్, మండల ప్రత్యేకాధికారి జాదవ్ రమేశ్, కెరమెరి మండల ప్రత్యేకాధికారి ఆడె ప్రకాశ్, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎస్ఎంసీ చైర్మన్లు ఉన్నారు.
సిర్పూర్-(యూ) మండలంలోని మహాగాం గ్రామంలో అదనపు కలెక్టర్ ఛాహత్ బాజ్పాయి పర్యటించారు. డ్రైనేజీలు, నర్సరీలోని మొక్కలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిరంతరం పారిశుధ్య పనులు చేపట్టి పరిసరాలను శుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. హరితహారం నాటికి మొక్కలు సిద్ధం చేయాలని సూచించారు. అనంతరం పాఠశాలను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయాన్ని సందర్శించి మండల పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది ఆమెను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీడీవో మధుసూదన్, ఆయా శాఖల అధికారులు ఉన్నారు.
మండలంలోని జంగాం ప్రాథమిక ఉర్దూ పాఠశాలను ప్రారంభించాలని ఆ గ్రామ పంచాయతీ కోఆప్షన్ సభ్యుడు సయ్యద్ సజ్జాద్ అలీ, పాఠశాల చైర్మన్ మహబుబ్ కోరారు. ఈ మేరకు జైనూర్లో అదనపు కల్టెర్ ఛాహత్ భాజ్పాయికు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యార్థులు పాఠశాలకు వచ్చి తిరిగి ఇంటికెళ్లి పోతున్నారన్నారు. స్పందించిన అదనపు కలెక్టర్ త్వరలో సమస్య పరిష్కరిస్తామని హామీనిచ్చారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పెందోర్ అర్జున్ గ్రామస్తులు, పోషకులు ఉన్నారు.
లింగాపూర్, జూన్ 20 : పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని అదనపు కలెక్టర్ ఛాహత్ బాజ్పాయి సూచించారు. మండలకేంద్రంలో సోమవారం ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు ఆమెకు స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రహదారులు, ప్రభుత్వ కార్యాలయలతో పాటు ఖాళీగా ఉన్న స్థలాల్లో మొక్కలు నాటాలన్నారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, మురుగు నీరు నిల్వ ఉండకుండా ఇంకుడు గుంతలు నిర్మించాలని పేర్కొన్నారు. ఇంట్లోని తడి, పొడి చెత్తను వేర్వేరుగా చేసి డంప్ యార్డులకు తరలించాలన్నారు. జీపీలకు అందజేసిన ట్రాక్టర్లను సక్రమంగా వినియోగిస్తూ, పాఠశాల, అంగన్వాడీ కేంద్రాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీవో ప్రసాద్, ఎంపీవో ఉమర్ షరీఫ్, ఏపీవో కృష్ణ, కార్యదర్శి అర్జున్ పాల్గొన్నారు.