ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులను చేర్పించాలని, ఉచిత సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు సూచించారు.
చెన్నూర్, జూన్ 20: చెన్నూర్ పట్టణంలోని ఎనగుట్ట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు మున్సిపల్ చైర్పర్సన్ అర్చనా గిల్డా సోమవారం స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు. దాతలు సిరంగి లహరి, పవన్ దంపతులు రూ.5 వేల విలువైన బ్యాగులను విరాళంగా అందించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు జోడు శంకర్, దోమకొండ అనిల్, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు కరుణాకర్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పుట్ట శ్రీనివాస్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
కోటపల్లి, జూన్ 20 : బడిబాట కార్యక్రమాన్ని పురస్కరించుకొని కోటపల్లి మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశం పొందిన విద్యార్థులకు అక్షరాభ్యాసం చేయించారు. కోటపల్లి, పారుపల్లి, కొల్లూరు, నక్కలపల్లి, పంగిడిసోమారంలోని ప్రాథమిక పాఠశాలల్లో హెచ్ఎంలు, సర్పంచ్‌లు, ఉపాధ్యాయులు అక్షరాభ్యాసం చేయించారు.
కన్నెపల్లి, జూన్ 20 : భీమిని మండలంలోని లక్ష్మీపూర్ ప్రాథమిక పాఠశాలలో చేరిన 1వ తరగతి విద్యార్థులతో ప్రధానోపాధ్యాయురాలు రమాదేవి సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. ఈ కార్యక్రమానికి భీమిని ఎంపీపీ పోతరాజుల రాజేశ్వరి అతిథిగా హాజరై అక్షరాభ్యాసం చేయించారు. ఎంపీపీ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చదివించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్ కస్తూరి సువర్ణ, ఉపాధ్యాయురాలు సరిత, పోతరాజుల రాజయ్య, లక్ష్మణ్, మల్లేశ్ తదితరులున్నారు.
తాండూర్, జూన్ 20 : ఆచార్య జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా మండలంలోని పలు గ్రామాలలో అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహించారు. రేచిని రోడ్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను రాష్ట్ర సర్కారు అభివృద్ధి చేస్తున్నదని తెలిపారు. మధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులను, ఆంగ్ల భాషలో విద్యాబోధన అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్ కోల విజయలక్ష్మి, సేవాజ్యోతి వ్యవస్థాపక అధ్యక్షురాలు గజ్జెల్లి శ్రీదేవి మల్లేశం తదితరులున్నారు.
మందమర్రి జూన్ 20: మందమర్రి మండలం, మున్సిపాలిటీ పరిధిలోని ఊరు మందమర్రి, నార్లాపూర్, ఎర్రగుంటపల్లి పాఠశాలలతో పాటు క్యాతనపల్లిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అక్షరాభ్యాసం నిర్వహించారు. చిన్నారులకు బిస్కెట్లు, చాక్లెట్లు పంపిణీ చేశారు.
చెన్నూర్ రూరల్, జూన్ 20: ప్రభుత్వ పాఠశాలలలో పిల్లలను చేర్పించాలని కొమ్మెర ప్రభుత్వ పాఠశాల హెచ్ఎం సరళాదేవి సూచించారు. కొమ్మెర గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో అక్షరాభ్యాసం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలో ఉన్న సౌకర్యాలు, వసతులను విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గట్టు పద్మ, నాయకులు తాళ్లపెల్లి కిరణ్ గౌడ్, గట్టు మొండె గౌడ్, ఉపాధ్యాయులున్నారు.
లక్షెట్టిపేట, జూన్ 20 : పట్టణంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో 6, 7, 8వ తరగతిలో ఇంగ్లిష్ మీడియంలో అడ్మిషన్లు తీసుకుంటున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ కవిత తెలిపారు. వీటితో పాటు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం (ఇంగ్లిష్ మీడియం)లో అడ్మిషన్లు తీసుకుంటున్నట్లు తెలిపారు. వివరాలకు 9704356395 నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు.
కాసిపేట, జూన్ 20 : మండలంలోని సామగూడ ప్రభుత్వ గిరిజన పాఠశాలను సోమవారం ప్రారంభించారు. విద్యార్థుల సంఖ్య లేకపోవడంతో నాలుగేళ్లుగా మూతపడి ఉంది. బడిబాట కార్యక్రమంతో విద్యార్థుల అడ్మిషన్లు పెరగడంతో డీటీడీవో నీలిమా ఆదేశాల మేరకు పాఠశాలను తిరిగి పునః ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మల్కేపల్లి కాంప్లెక్స్ హెచ్ మహేశ్వర్‌రెడ్డి, ఎస్సీఆర్పీ చందు, సీఆర్టీ శ్రీనివాస్, వార్డు సభ్యుడు శేఖర్ పాల్గొన్నారు.