దండేపల్లి, జూన్ 20: పేద విద్యార్థుల బంగారు భవిష్యత్ కోసమే ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అన్నారు. దండేపల్లి మండలం పాత మామిడిపెల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో సోమవారం మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా రూ.22 లక్షలతో నిర్మించనున్న భోజనశాల నిర్మాణానికి స్థానిక నాయకులతో కలిసి భూమిపూజ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నత విద్యా ప్రమాణాలతో పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారని తెలిపారు. మన ఊరు- మన బడితో పాఠశాలల రూపు రేఖలు మారనున్నాయని తెలిపారు. సర్కారు మూడు విడుతల్లో రాష్ట్ర వ్యాప్తంగా ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని నిర్వహించి ఆంగ్ల భాషలో ఉత్తమ విద్యను అందించనుందని తెలిపారు. గ్రామీణ విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల జోలికి వెళ్లకుండా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించేలా చూడాలన్నారు.
పూర్వ విద్యార్థులు, ఎన్ఆర్ఐలు, గ్రామానికి చెందిన వారు విరాళాలు సమకూర్చి పాఠశాలలకు అందిస్తే మరింత అభివృద్ధి చెందుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో నడిపెల్లి ట్రస్ట్ చైర్మన్ విజిత్‌రావు, ఎంపీపీ గడ్డం శ్రీనివాస్, రైతు బంధు సమితి జిల్లా కన్వీనర్ గురువయ్య, పీఏసీఎస్ చైర్మన్ సురేశ్, వైస్ ఎంపీపీ అనిల్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చుంచు శ్రీనివాస్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రేని శ్రీనివాస్, సర్పంచ్ శ్రీనివాస్, ఎంపీటీసీ శిరీష, హెచ్ఎం పర్వతీ సత్యనారాయణ, విద్యా కమిటీ చైర్మన్ యుగేంధర్, టీఆర్ఎస్ నాయకులు పత్తిపాక సంతోష్, గాలిపెల్లి సత్యనారాయణ, ఎల్తపు సుభాష్, నలిమెల మహేశ్, లక్ష్మణ్, శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.