హాజీపూర్, జూన్ 20 : ప్రజావాణికి వచ్చిన జిల్లా వాసుల అర్జీలను సంబంధిత శాఖల అధికారులు పరిష్కరించేందుకు కృషి చేయాలని మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లోని కలెక్టర్ చాంబర్లో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. బెల్లంపల్లి రడగంబాల బస్తీకి చెందిన జిల్లు రవీందర్ తాను బీటెక్ పూర్తి చేశానని, తనకు ఉపాధి కల్పించాలని కోరుతూ దరఖాస్తు చేశాడు. మంచిర్యాల పట్టణానికి చెందిన నల్ల రమేశ్ తనకు తిమ్మాపూర్ శివారులో భూమి ఉందని అందులో కొంత భాగం రోడ్డు విస్తరణలో పోయిందని నష్ట పరిహారం ఇప్పించాలని కోరాడు. హాజీపూర్ మండలంలోని ముల్కల్ల గ్రామానికి చెందిన ధర్వాజ వెంకటస్వామి ఆన్లైన్లో భూ విస్తీర్ణం తప్పుగా చూపుతున్నదని తెలిపాడు. మందమర్రి మండలం అమరవాది గ్రామానికి చెందిన రొడ్డ మల్లేశ్ తనకు గ్రామ శివారులో భూమి ఉందని, ఆన్లైన్లో నమోదు చేసి పట్టాదారు పాసు పుస్తకాన్ని మంజూరు చేయాలని అర్జీ ఇచ్చాడు. జన్నారం మండలానికి మహ్మదాబాద్‌కు చెందిన జాడి దుర్గయ్య తనకు చిందగూడ గ్రామ శివారులో ఉన్న భూమిపై కొంత మంది కోర్టులో కేసువేశారని, కేసు కొనసాగుతుండగానే తాను సాగు చేసిన పంటను కోస్తున్నారని, న్యాయం చేయాలని కోరాడు. వేమనపల్లి మండలం సూరారం గ్రామానికి చెందిన ఆలం మొండి తన భూమిలో క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విన్నవించాడు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన అర్జీలను పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
క్రీడా రంగాన్ని ప్రోత్సహించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న క్రీడా ప్రాంగాణాలను వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి సూచించారు. కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్‌తో కలిసి జిల్లాలో క్రీడా ప్రాంగణాలు, ప్రజావాణిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 16 మండలాలలోని 548 గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసేందుకు 413 గ్రామాలను గుర్తించినట్లు తెలిపారు.
మిగిలిన 135 గ్రామాలను పరిశీలించాలని తెలిపారు. ప్రత్యేక అధికారులు ఆయా మండలాలలో తప్పనిసరిగా ప్రజావాణికి హాజరై అర్జీదారులు చేసుకున్న దరఖాస్తులను పూర్తి స్థాయిలో పరిష్కరించాలని ఆదేశించారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం భూములు కలిగిన పట్టాదారుల వివరాలను ఆన్లైన్ ద్వారా ధరణి పోర్టల్‌తో సంబంధిత మాడ్యుల్లో నమోదు చేయాలన్నారు. అర్హత కలిగిన వారికి పట్టాదారు పాసు పుస్తకాలను మంజూరు చేయాలన్నారు.
ధరణిలో పొందుపర్చిన 33 మాడ్యూల్లో సమస్యలను పరిష్కరించే దిశగా దృష్టి సారించాలన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమ లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు అధికారులు, ప్రజా ప్రతినిధులు కృషిచేయాలని సూచించారు. చెత్తతో తయారు చేసిన కంపోస్ట్ ఎరువును పల్లె ప్రకృతి వనాల్లోని మొక్కలకు వాడాలన్నారు. ఈ కార్యక్రమంలో డీపీవో నారాయణ రావు, బెల్లంపల్లి ఆర్డీవో శ్యామలాదేవి, జడ్పీ సీఈవో నరేందర్, మండలాల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.