నిర్మల్ టౌన్, జూన్ 20 : కేంద్రప్రభుత్వం రక్షణ విభాగంలో తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ, పీడీఎస్‌యూ, ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో సోమవారం నిరసన తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో ఏవోకు వినతిపత్రం అందజేశారు. దేశ రక్షణ విభాగంలో పనిచేస్తున్న దళాలను బలహీన పర్చేందుకే నాలుగు సంవత్సరాల కాంట్రాక్టుపై సైనికుల ఎంపిక కోసం అగ్నిపథ్ తేవడం దురదృష్టకరమన్నారు. యువత దేశ సేవ కోసం సైన్యంలో చేరేందుకు ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ పథకం ద్వారా వారిని నిరాశకు గురిచేసిందని వాపోయారు. నాయకులు రాజు, వెంకట్, నారాయణ, మహేందర్, గంగాధర్, దీనాజీ పాల్గొన్నారు.
భైంసా, జూన్ 20 : అగ్నిపథ్ పథకాన్ని కేంద్రం వెంటనే ఉప సంహరించుకోవాలని ఏఐకేఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జే రాజు డిమాండ్ చేశారు. పట్టణంలోని అఖిల భారత రైతు కూలీ సంఘం, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో తహసీల్ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. యువతను నాలుగు సంవత్సరాలకు కాంట్రాక్ట్ సైనికులుగా మార్చే పథకాన్ని వెంటనే ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మోదీ ప్రభుత్వం ప్రజా, దేశ వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదని దుయ్యబట్టారు.
ఈ అగ్నిపథ్ పథకం ప్రకటించడంతో నిరుద్యోగ యువకులు దేశంలో పెద్ద ఎత్తున నిరసన చేపట్టారన్నారు. ఉద్యమాన్ని అణచివేయడానికి అరెస్టులు, నిర్బంధం కేసులు పెడుతున్నప్పటికీ ఉద్యమం పెరుగుతూనే ఉందని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అఖిల భారత రైతు కూలీ సంఘం అధ్యక్షుడు డాక్టర్ అశిష్ మిట్టల్‌పై అక్రమంగా మోపిన కేసులను ఉపసంహరించుకోవాలన్నారు. పీవోడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి హరిత, పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి మహేందర్, దినాజీ, గంగాధర్, నారాయణ పాల్గొన్నారు.
నిర్మల్ చైన్‌గేట్, జూన్ 20 : కేంద్ర ప్రభుత్వం కార్మిక, కర్షక వ్యతిరేక చట్టాలు, అగ్నిపథ్ వంటివి తీసుకొచ్చి ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నదని సీపీఐ నిర్మల్ జిల్లా కార్యదర్శి ఎస్ విలాస్ అన్నారు. నిర్మల్ పట్టణ 3వ మహాసభ నిర్మల్‌లోని ఇందిరానగర్ కార్యాలయంలో సోమవారం జాదవ్ శంకర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సిటిజన్‌షిప్, కార్మిక వ్యతిరేక కోడ్ల పేరిట, దేశాన్ని కాపాడే సైనిక వ్యతిరేక కార్యకలాపాలతో దేశాన్ని అల్లకల్లోలం చేస్తున్నదని మండిపడ్డారు. అన్ని వార్డుల్లో పార్టీ బలోపేతానికి సభ్యత్వ నమోదు ప్రారంభించాలని సూచించారు.
సీపీఐ పట్టణ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. నిర్మల్ పట్టణ కార్యదర్శిగా ఎస్.సాయి, సహాయ కార్యదర్శులుగా జాదవ్ శంకర్, డీ నాగభూషణం, 15 మంది కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.