పల్లె మారింది.. నిజంగా ఊహించనంతగా మార్పు చెందింది. అసలు మనం ఉన్నది పల్లెలోనేనా అనే ఫీలింగ్ కలుగుతుంది. నాటి.. గుంతల మట్టిరోడ్లు, దుర్గంధం వెదజల్లే డ్రెయినేజీలు, నెర్రలువారిన నేలలు, పానీపట్టు యుద్ధాలు, ఎడారి బతుకులు, గోళి-సూదీ లేక ప్రాణాలు పోయే రోజులు కానరావడం లేదు. నేడు.. టీఆర్ఎస్ ఎనిమిదేళ్లలో పాలనలో జిల్లాల నుంచి మండలాలకు.. మండలాల నుంచి పల్లెలకు తారురోడ్లు దర్శనమిస్తున్నాయి. ప్రతి వీధిలో సీసీ రోడ్లు అద్దాల్లా మెరుస్తున్నాయి. ఇంటి ముందుకే వచ్చిన భగీరథుడు, మిషన్ కాకతీయ ఫలితంగా జలకళతో ఉట్టిపడుతున్న చెరువులు, పచ్చని తివాచీ పరుచుకున్నట్లున్న చేలు.. దండిగా ధాన్యపురాశులతో కళకళలాడుతున్న ఇండ్లే కనిపిస్తున్నాయి. నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని సాకెర గ్రామంపై ‘నమస్తే’ ఫీల్డ్ విజిట్..

నిర్మల్, జూన్ 20(నమస్తే తెలంగాణ): ఎనిమిదేండ్ల క్రితం వరకు పల్లెలంటే.. బీడువారిన భూములు, గతుకుల రోడ్లు, రహదారులపై దుర్గంధం వెదజల్లుతూ పారే మురుగునీరు, మోడువారిన బతుకులు, తాగునీటి కోసం తల్లడిల్లిన పల్లెలు, ఉపాధి కోసం ముల్లేమూట సర్దుకొని ఎడారి దేశాలకు పయనమైన జీవితాలు, అందనంత దూరంలో ప్రభుత్వ పథకాలు, ఎదుగూబొదుగూ లేని బతుకులు, ఎక్కడా కనిపించని కనీస సదుపాయాలు.. కానీ.. ఎనిమిదేండ్ల టీఆర్ఎస్ పాలనలో పల్లె రూపురేఖలు అనూహ్యంగా మారిపోయాయి.
భూతల్లి కడుపు నిండా నీళ్లు, ఎటు చూసినా పచ్చని పొలాలు, తోటలు.. సొంతూరిలోనే కావాల్సినంత పని, అడుగకున్నా ఇంటింటికీ చేరుతున్న ప్రభుత్వ పథకాలు.. మొత్తంగా పల్లెలు అభ్యుదయ బాటలో పయనిస్తున్నాయి. టీఆర్ఎస్ పాలనలో పల్లెలు అభివృద్ధి చెందాయనడానికి నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని సాకెర గ్రామమే చక్కటి ఉదాహరణ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఈ పల్లె దుస్థితి.. స్వరాష్ట్రంలో మారిన పరిస్థితిపై ‘నమస్తే’ ఫీల్డ్ విజిట్..
ఆరోగ్యం బాగా లేక మా భర్త రేగుంట చిన్న నర్సయ్య రెండేండ్ల కింద కాలం చేసిండు. ఆయన పేరు మీద మూడెకరాల వ్యవసాయ భూమి ఉన్నది. 60 ఏండ్లలోపు రైతులు చనిపోతే రూ.ఐదు లక్షల రైతుబీమా వస్తదని ఆఫీసర్లు చెప్పిన్రు. మా భర్తకు 55 ఏండ్లు ఉండడం వల్ల రూ.5 లక్షలు నా బ్యాంకు ఖాతాలో వేశారు. ఆయన ఆరోగ్యం బాగు చేయించేందుకు అప్పులు చేసి హైదరాబాద్‌లోని ప్రైవేటు దవాఖానలో ఆపరేషన్ చేయించాం. అయినా బతకలేదు. ప్రభుత్వం ఇచ్చిన రైతుబీమా పైసలతో మా అప్పులు కట్టిన.
– రేగుంట గంగామణి
ఇప్పుడు.. పల్లెల్లో ఎటు చూసినా పచ్చదనమే. స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత అధికారం చేపట్టిన టీఆర్ఎస్ ప్రభుత్వం మొదటి నుంచి హరితహారం కార్యక్రమానికి అధిక ప్రాధాన్యమిచ్చింది. పచ్చదనాన్ని పెంపొందించుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించింది. కోట్లాది మొక్కలను నాటే విధంగా అధికారులకు లక్ష్యాన్ని నిర్దేశించింది. దీంతో గ్రామాలు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. సాకెరలో ఇప్పటి వరకు 10వేలకు పైగా మొక్కలు నాటారు. ఇవీ కాకుండా గ్రామస్తుల ఆటవిడుపు కోసం ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనంలో 4వేల మొక్కలు నాటారు. వచ్చే హరితహారంలో నాటేందుకు గ్రామంలోనే నర్సరీని ఏర్పాటు చేసి 13 వేల మొక్కలను సిద్ధంగా ఉంచారు. నాటిన మొక్కలను కాపాడేందుకు పంచాయతీకి ట్రాక్టర్, ట్యాంకర్‌ను అందజేశారు.

అప్పుడు.. నాడు గ్రామంలోని రైతులకు పంటలు పండించడానికి సరైన సాగు నీటి సదుపాయం లేదు. గ్రామస్తులకు మంచినీటి సదుపాయం అంతంత మాత్రమే. ఇలాంటి పరిస్థితుల్లో పచ్చదనాన్ని పెంపొందించాలనే ఆలోచనే లేదు. ఒక వైపు కరంటు కోతలు, మరోవైపు నిలువ నీడ లేక, ఉక్కపోత భరించలేక పల్లె ప్రజలు రోజంతా నరకం అనుభవించే వారు.
నాకున్న కొద్దిపాటి వ్యవసాయ భూమి నుంచి ఆరు గుంటలను చేపల చెరువు కోసం కేటాయించా. ఫిష్ పాండ్స్ కోసం ఉపాధి కూలీలను పెట్టుకోవచ్చని అధికారులు చెప్పడంతో చేపల చెరువు తవ్వించి, చేపల పెంపకాన్ని చేపట్టా. ఏడాది క్రితం ఏర్పాటు చేసిన ఈ చెరువులో జగిత్యాల నుంచి ఐదు వేల చేప పిల్లలను తెచ్చి నీటిలో వదిలా. బొచ్చె, రవ్వు, బంగారు తీగ రకాలు ఉన్నాయి. మూడు టన్నుల దిగుబడి వస్తుందని అనుకుంటున్నా. ఖర్చులు పోను ఏడాదికి రూ.3 లక్షల వరకు ఆదాయం వస్తుంది. ప్రభుత్వమే కూలీలతో చెరువును తవ్వించడం వల్ల దాదాపు రూ.1.50 లక్షలు మిగిలాయి.
– శ్రీనివాస్, రైతు
దళితబంధు పథకం దారి చూపింది. ఆటోడ్రైవర్‌గా పనిచేసుకుంటూ భార్య, ఇద్దరు కూతుళ్లతో కలిసి జీవితాన్ని నెట్టుకొస్తున్న నాకు ఈ ప్రభుత్వం ఓటెంట్ హౌస్ ఓనర్ని చేసింది. ఎన్ని జన్మలెత్తినా సీఎం కేసీఆర్ రుణం తీర్చుకోలేనిది. దళితబంధు కింద మంజూరైన రూ.10 లక్షలతో కడ్తాల్ గ్రామంలో టెంట్‌హౌస్ దుకాణాన్ని ఇటీవలే ప్రారంభించా. నాలాంటి నిరుపేదలను తలెత్తుకొని బతికేలా ఉపాధి కల్పిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
– శివలింగం, లబ్ధిదారుడు
గతంలో ఏ ప్రభుత్వాలు కూడా ఈ విధంగా పేదల గురించి ఆలోచించ లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలకు మేలు జరుగుతున్నది. మాకు గత మార్చిలో పాప పుట్టింది. నిర్మల్‌లోని ప్రభుత్వ ప్రసూతి దవాఖానలో డెలివరీ అయ్యింది. రెండో రోజే కేసీఆర్ కిట్ ఇచ్చారు. దాంట్లో పాప సంరక్షణకు అవసరమైన అన్ని వస్తువులు ఉన్నాయి. అలాగే పాప పుట్టిందని రూ.13 వేలు ఇచ్చారు. పేదలకు ఇంతకంటే ఏంకావాలి.
– గౌతమి, గృహిణి

అప్పుడు.. సాకెర రైతులకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు(ఎస్సారెస్పీ)కింద సరస్వతీ కాలువనే ప్రధాన సాగు నీటి వనరు. ప్రాజెక్టు నుంచి కాలువకు నీటిని విడుదల చేస్తేనే పంటలు పండేవి. ఆశించిన వర్షాలు కురియక ప్రాజెక్టులో నీరు చేరకపోతే కాలువపైనే ఆధారపడ్డ రైతులకు ఆ యేడు తీవ్ర నిరాశే మిగిలేది. భూగర్భ జలాలు అంతంత మాత్రంగానే ఉండడంతో బోరుబావులు వేసేందుకు రైతులు ముందుకు వచ్చే వారు కాదు. అలాగే గ్రామంలో తాగునీటి కోసం ప్రజలు అనేక ఇబ్బందులు పడేవారు. గ్రామ శివారు నుంచే స్వర్ణ వాగు ప్రవహిస్తున్నా తాగు, సాగు నీటికి తిప్పలు తప్పేవి కాదు. నాటి పాలకుల నిర్లక్ష్యం వల్ల గ్రామస్తులు అవస్థలు పడ్డారు.
ఇప్పుడు.. నాలుగేళ్ల క్రితం ప్రభుత్వం రూ.2 కోట్లు వెచ్చించి సాకెర, కౌట్ల(కె) గ్రామాల మధ్య స్వర్ణ వాగుపై భారీ చెక్‌డ్యాం నిర్మించింది. దీంతో వాగులో నీరు నిలిచి చెరువును తలపిస్తున్నది. మండు వేసవిలో సైతం నిండుకుండలా కనిపిస్తున్న వాగు నీటితో ఈ రెండు గ్రామాల్లో భూగర్భ జలాలు భారీగా పెరిగాయి. నిండుగా ఉన్న వాగునీటిని రైతులు విద్యుత్ మోటర్ల ద్వారా తమ పంట పొలాల్లోకి మళ్లించి రెండు పంటలు పండిస్తున్నారు.

అప్పుడు..తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు సాకెర గ్రామం.. కడ్తాల్ గ్రామ పంచాయతీకి అనుబంధంగా ఉండేది. 2014లో రాష్ట్రం ఏర్పడ్డ తరువాత అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం తండాలను, గూడేలను గ్రామ పంచాయతీలుగా మార్చింది. ఈ క్రమంలోనే పంచాయతీగా ఏర్పడ్డ సాకెరలో ఒక్కొక్కటిగా సమస్యలన్నీ పరిష్కారానికి నోచుకున్నాయి. నాడు ఊరంతా గుంతలు పడ్డ మట్టి రోడ్లు, మోరీలు లేక మురుగు నీరంతా రోడ్లపైకి వచ్చి ముక్కుపుటాలదిరే దుర్గంధం, చిన్న వర్షం పడినా బురదమయమయ్యే రోడ్లు దర్శనమిచ్చేవి. కేవలం నిర్మల్ జిల్లా కేంద్రానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నా అభివృద్ధికి నోచుకోలేదు.
ఇప్పుడు.. ప్రతి పల్లెలో వీధి వీధినా సీసీ రోడ్లు, ఇరువైపులా రకరకాల పూలు, పండ్ల చెట్లు, మురుగునీటి కాలువలు, సూచిక బోర్డులు దర్శనమిస్తాయి. 2.6 కిలో మీటర్ల మేర అంతర్గత సీసీ రోడ్లు నిర్మించారు. మండల కేంద్రానికి వెళ్లేందుకు బీటీ రోడ్డు వేశారు. నాలుగో విడుత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు 2021లో సాకెర గ్రామానికి వచ్చారు. రూ.30 లక్షలు మంజూరు చేశారు. ఆ నిధులతో ప్రతి గల్లీలో 2 కిలో మీటర్ల మేర ఓపెన్ డ్రైనేజీ నిర్మాణం చేపట్టారు. గ్రామానికి ఒక ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ మంజూరు చేశారు.
