నిర్మల్ చైన్‌గేట్, జూన్ 17 : సంపూర్ణ ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ పట్టణంలో శుక్రవారం బస్తీ దవాఖానను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం పేదల ఆరోగ్యానికి పెద్దపీట వేసిందన్నారు. అందులో భాగంగా ప్రజలకు అందుబాటులో ఉండేందుకు బస్తీ దవాఖానలను ఏర్పాటు చేసిందని తెలిపారు. ఈ దవాఖానలో ఒక డాక్టర్, స్టాఫ్ నర్సుతో పాటు సపోర్టింగ్ స్టాఫ్ ఇద్దరు ఉంటారన్నారు. ఇంతకుముందు చిన్నపాటి జ్వరాలు వచ్చినా పెద్ద దవాఖానలకు వెళ్లాల్సి వచ్చేదని పేర్కొన్నారు.
కానీ బస్తీ దవాఖాన అందుబాటులోకి రావడంతో ఈ ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. నిర్మల్‌లో 280 పడకల దవాకాన మంజూరవగా, నిర్మాణంలో ఉన్నదని చెప్పారు. సీఎం కేసీఆర్ నిర్మల్‌లో నర్సింగ్ కళాశాల మంజూరుచేశారని తెలిపారు. అలాగే మహిళా శిశుసంక్షేమ అభివృద్ధిలో భాగంగా ప్రస్తుతం ఉన్న ఏరియా దవాఖానలో అన్ని వసతులతో కూడిన దవాఖాన నిర్మించేందుకు కృషిచేస్తున్నట్లు వెల్లడించారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత అనేక దవాఖానలు నిర్మించినట్లు, ఉట్నూర్లోనూ నిర్మించామని చెప్పారు.
పట్టణ ప్రగతిలో భాగంగా రోజుకో కార్యక్రమం నిర్వహించుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మీరాంకిషన్రెడ్డి, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, డీఎంహెచ్‌వో ధన్‌రాజ్, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, కౌన్సిలర్ రఫు, గ్రంథాలయ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, మున్సిపల్ కమిషనర్ సంపత్‌కుమార్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము, పలు శాఖల అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.
నిర్మల్ అర్బన్, జూన్ 17 : నిర్మల్ పట్టణం బుధవార్‌పేట కాలనీలోని వైకుంఠధామం అదనపు పనులను మంత్రి అల్లోల ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్ రాంకిషన్‌రెడ్డి, నాయకులు మారుగొండ నరేందర్, కొట్టె శేఖర్, డీ శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు.