ఆసిఫాబాద్,జూన్16 : ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని గురువారం ఎమ్మెల్యే ఆత్రం సక్కు,ఎస్పీ సురేశ్ కుమార్,అదనపు కలెక్టర్లు రాజేశం,చాహత్ బాజ్పాయ్తో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేసేందుకు కృషి చేయాలన్నారు.
ఎస్సీ,ఎస్టీలకు ఆయా శాఖల ద్వారా ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని తెలిపారు. వీటి ద్వారా వారు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని పేర్కొన్నారు. ఎస్సీ,ఎస్టీలకు ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీ పథకాలను వివరించాలన్నారు. యువత చెడు దారిన పడకుండా చూడాల్సిన బాధ్యత కమిటీపై ఉందని చెప్పారు. జిల్లాలో 234 కేసులు నమోదైనట్లు ఎస్పీ సురేశ్ కుమార్ తెలిపారు. ఇందులో 93 కేసులు పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. 11 కేసులు భూములకు సంబంధించినవని తెలిపారు. మరో 36 కేసులు పరిష్కారం దిశగా చివరి దశలో ఉన్నాయని వెల్లడించారు.
అంతక ముందు ఎమ్మెల్యే ఆత్రం సక్కు మాట్లాడారు. జిల్లాలో బెల్టుషాపులు లేకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. అట్రాసిటీ యాక్ట్ దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యత కమిటీ సభ్యులపై ఉందన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ అచ్చేశ్వర్రావు, గిరిజన సంక్షేమాధికారి మణెమ్మ, ఎస్సీ,ఎస్టీ కమిటీ సభ్యులు రేగుంట కుశవ్, అర్జు మాస్టర్, గోపాల్ నాయక్, గణేశ్, వెంకటేశ్, శ్యాంరావ్ పాల్గొన్నారు.