చెన్నూర్, జూన్ 16: చెన్నూర్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, సుందరంగా తీర్చి దిద్దనున్నట్లు ప్రభుత్వ విప్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. చెన్నూర్ పట్టణంలో ఫేజ్-1, ఫేజ్-2లో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం మున్సిపల్ పాలకవర్గ సభ్యులు, సంబంధిత అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. పట్టణంలో ఫేజ్-1లో భాగంగా రూ.140కోట్లతో జరుగుతున్న పలు అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులతో చర్చించారు. పట్టణంలో రూ . 25 కోట్లతో జలాల్ పెట్రోల్ బంక్ నుంచి అంబేద్కర్ జంక్షన్ వరకు పట్టణ ప్రధాన రహదారి విస్తరణ పనులు, పెద్ద చెరువు నుంచి బుద్దారం వరకు బైపాస్ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయని తెలిపారు.
మిషన్ భగీరథ పథకం ద్వారా పట్టణంలో రూ 17.52 కోట్లతో 99.49 కిలోమీటర్ల పైప్ లైన్ వేసి 7,629గృహాలకు తాగు నీరు అందిస్తున్నట్లు తెలిపారు. కార్పొరేట్ స్థాయిలో పట్టణం నడిబొడ్డున రూ. 7 కోట్లతో ప్రభుత్వ దవాఖాన నూతన భవన నిర్మాణం పనులు శరవేగంగా సాగుతున్నాయని వెల్లడించారు. వచ్చే 40 ఏండ్ల జనాభా అంచనా దృష్ట్యా ముందు చూపుతో రూ 7.20 కోట్లతో ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్‌ను నిర్మిస్తున్నట్లు వివరించారు. పెద్ద చెరువు, కుమ్మరి కుంట మినీ ట్యాంకు బండ్ నిర్మాణం పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. చెన్నూర్ పట్టణంలో రూ 21.02 కోట్లతో 400 డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం పనులు చురుగ్గా సాగుతున్నాయని, వాటి పనులను మరింత వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.
రూ. 90 లక్షలతో 18 వార్డుల్లో బతుకమ్మ మైదానాలు నిర్మించనున్నట్లు తెలిపారు. రూ. 2.50 కోట్లతో కేసీఆర్ పార్కు, రూ. కోటితో వైకుంఠధామం, రూ .కోటితో 33/11కేవీ సబ్ స్టేషన్ నిర్మిస్తున్నట్లు తెలిపారు. రూ.40 లక్షలతో రెండు ఓపెన్ జిమ్‌లు, రూ .1.50 కోట్లతో డంప్ యార్డు, రూ 1.50 కోట్లతో సమ్మక్క-సారలమ్మ మహిళా భవన్, రూ .80 లక్షలతో నాలుగు కేసీఆర్ మల్టీపర్పస్ కమ్యూనిటీ భవనాలు, రూ. కోటితో స్వచ్ఛ ఆటోలు, రూ. కోటితో నిర్మించే మురుగు కాలువలు, రూ. కోటితో బృహత్ ప్రకృతి వనం, ఐదు చిల్డ్రన్స్ ప్లే ఏరియా, రూ. 2.58 కోట్లతో జంతు వధశాలల ఏర్పాటు పనులపై అధికారులతో చర్చించారు. ఇలా ఫేజ్-1లో నిర్దేశించుకున్న పనులు కొలిక్కి వస్తున్న నేపథ్యంలో ఫేజ్-2లో చేపడుతున్న పలు అభివృద్ధి పనులపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
పట్టణ మౌలిక వసతుల కల్పనలో భాగంగా మున్సిపాలిటీ పరిధిలోని 18 వార్డుల్లో వార్డుకు రూ. 60 లక్షల చొప్పున నిధులు కేటాయించి అంతర్గత రోడ్లు, డ్రైనేజీలు నిర్మించనున్నట్లు తెలిపారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం నుంచి హైవే రోడ్డు వరకు, బైరి సత్తన్న జంక్షన్ నుంచి హైవే రోడ్డు వరకు , సీతారాం తోట రోడ్డు నుంచి లైన్ గడ్డ పాఠశాల వరకు సిమెంట్ రోడ్లు నిర్మించేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. బొక్కలకుంట, కుమ్మరి కుంటల వద్ద రూ. 20లక్షలతో రెండు కేసీఆర్ కమ్యూనిటీ భవనాలను నిర్మించనున్నట్లు తెలిపారు. సమావేశంలో మున్సిపాలిటీ పాలక వర్గ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.
చెన్నూర్‌లో ప్రభుత్వ విప్ బాల్క సుమన్ గురువారం కాలి నడకన సుడి గాలి పర్యటన చేశారు. పట్టణ ప్రగతి పనులను పరిశీలించారు. ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అలాగే పలువురిని పరామర్శించారు. దళిత బంధు పథకం ద్వారా చెన్నూర్ పట్టణంలో ఏర్పాటు చేసిన శ్రీ వెంకటేశ్వర్ డయాగ్నస్టిక్ కేంద్రాన్ని విప్ ప్రారంభించారు. ఆయన వెంట టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.
రామకృష్ణాపూర్, జూన్ 16: క్యాతనపల్లిలోని 18వ వార్డులో పట్టణ ప్రగతి పనులను విప్ బాల్క సుమన్ పరిశీలించారు. టీఆర్ఎస్ సీనియర్ నాయకులు దాసరి అంజయ్య,బోయినపల్లి నర్సింగరావు ఇటీవల మృతి చెందగా బాధిత కుటుంబాలను పరామర్శించి సానుభూతి తెలిపారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన టీఆర్ఎస్ నాయకుడు గంగారాజును పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, సీనియర్ నాయకుడు గాండ్ల సమ్మయ్య, గోపు రాజం, ఎర్రబెల్లి రాజేశ్, కౌన్సిలర్లు ఎల్లబెల్లి మూర్తి, కొక్కుల సతీశ్, జిలకర మహేశ్ ఉన్నారు.