ఇచ్చోడ, జూన్ 16 : కుష్ఠు నివారణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని కుష్ఠు నివారణ అదనపు డైరెక్టర్ రవీంద్ర నాయక్ అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానను గురువారం ఆయన తనిఖీ చేశారు. వ్యాధిగ్రస్తులకు సంబంధించిన రికార్డులు పరిశీలించారు. వైద్య సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. పరీక్ష నిర్వహణ, చికిత్స పొందుతున్న కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజారోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. కుష్ఠు లక్షణాలు ఉన్న వారిని గుర్తించి చికిత్స చేయాలన్నారు. గ్రామాల్లో వ్యాధి నియంత్రణపై అవగాహన కల్పించాలన్నారు. దవాఖానలో సాధారణ ప్రసవాల సంఖ్య పెరుగుతుండడంపై సిబ్బందిని అభినందించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్వో సాధన, వైద్యాధికారులు సాగర్, శ్రీకాంత్, పవన్, క్రాంతి, డీపీవో అనిల్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.