తొలకరి పలుకరించడంతో కర్షకులు పొలంబాట పడుతున్నారు. రుతు పవనాలు రాష్ర్టాన్ని తాకుతాయనే ముందస్తు సమాచారంతో దుక్కులు దున్ని సిద్ధం చేసుకున్నారు. పార, పలుగ తీసుకొని సాగుబాట పట్టడంతో పండుగ వాతావరణం నెలకొంది. విత్తనాలు, ఎరువుల కోసం దుకాణాలకు చేరుకోవడంతో సందడిగా మారాయి. రుణాల కోసం బ్యాంకుల వద్ద బారులుదీరుతున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో పంటలపై అవగాహన కల్పిస్తున్నారు. కాగా.. అధిక వర్షాలు కురిసినప్పుడు భూమిలో తేమశాతం పెరుగుతుందని, అప్పుడే విత్తనాలు విత్తాలని, విత్తనాల కొనుగోళ్లలో జాగ్రత్తలు పాటించాలని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు.
ఆదిలాబాద్ (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/నిర్మల్ టౌన్, జూన్ 16 : వ్యవసాయానికి ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో యేటా సాగు విస్తీర్ణం పెరుగుతున్నది. కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్న యువత కూడా సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. యేడాదికి రెండు విభిన్న పంటలు పండి స్తూ లాభాలు ఆర్జిస్తున్నారు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల పరిధిలో ఈ యేడాది 9.71 లక్షల ఎకరాల్లో వివిధ పం టలు సాగవుతాయని వ్యవసాయశాఖ అధికారులు అం చనా వేశారు. ఆదిలాబాద్ జిల్లాలో 5.71 లక్షల ఎకరాలు, నిర్మల్ జిల్లాలో 4 లక్షల ఎకరాల విస్తీర్ణం పం టలు వేసే అవకాశం ఉంది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నల్లరేగడి నేలలు అధికంగా ఉండడం, పత్తికి రికార్డుస్థాయిలో రూ.14 వేలకుపైగా ధర పలుకడంతో పత్తి వైపు మొగ్గు చూపుతున్నారు. ఆదిలాబాద్లో 3.95 లక్షలు, నిర్మల్లో 1.61 లక్షలు మొత్తం 5.56 లక్షల ఎకరాల్లో పత్తి సా గవుతుందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. పత్తి తర్వాత కంది, సోయా పంట అధికంగా సాగు కానున్నది. కాగా.. వానకాలం సాగులో భాగంగా సీజన్ ప్రారంభానికి ముందుగానే రైతులు భూములను సిద్ధం చేసుకుని విత్తనాలను కొనుగోలు చేశారు. తొలకరి జల్లులు పడగానే విత్తనాలు వేస్తున్నారు. ఆదిలాబాద్లో 11.85 లక్షలు, నిర్మల్లో 5 లక్షల పత్తి విత్తన ప్యాకెట్లను అందుబాటులో ఉంచారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఈ యేడాది 4,51,778 ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని అధికారులు అంచనాలు వేస్తున్నారు. పత్తి 3,37,374, వరి 55,534, కంది 44,722, పెసర 2,948, సోయా 1,754, ఇతర పంటలు 9,446 ఎకరా ల్లో సాగు కానున్నాయి. యూరియా 46 వేల మెట్రిక్ టన్ను లు, కాం ప్లెక్స్ ఎరువులు 23 వేలు, డీఏపీ 23 వేలు, పొ టాష్ 23 వేలు, ఇతర ఎరువులు 23 వేల మెట్రిక్ టన్నులు అవసరమవుతాయని అధికారులు భావిస్తున్నారు. కాగా ప్రస్తుతం 20 వేల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని పంట పొలాల్లో పెద్ద ఎత్తున ఆరుద్ర పురుగులు కనిపించాయి, స్థానికులు ఆసక్తిగా తిలకించారు.
అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. విత్తనాలు వేయడానికి భూమిలో అవసరమైన తేమ శాతం ఉండాలి. వర్షాలతో తేమ శాతం పెరిగినపుడే రైతులు విత్తనాలు వేయాలి. పత్తి, కంది, సోయా విత్తనాలను దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్నాం. విత్తనాలు కొనుగోళ్లలో జాగ్రత్తలు తీసుకోవాలి. సాగులో వ్యవసాయ అధికారులు, విస్తరణ అధికారులు సలహాలు, సూచనలు పాటించాలి.