నిర్మల్ జిల్లా మైనార్టీ ఎడ్యుకేషన్ హబ్‌గా మారుతున్నది. జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో చించోలి వద్ద పదెకరాల్లో బాలురు, బాలికలకు వేర్వేరుగా హాస్టళ్లు, డైనింగ్‌హాల్స్, కామన్ సర్వీస్ సెంటర్, కాలేజీ భవన నిర్మాణాలు చురుకుగా కొనసాగుతున్నాయి. రూ.100 కోట్లు కేటాయించగా.. ప్రస్తుతం రూ.50 కోట్లతో పనులు చేపట్టారు. అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రత్యేక చొరవతో పనులు దాదాపు 90 శాతం మేర పూర్తయ్యాయి. నిర్మల్‌లోని అద్దె భవనంలో నిర్వహిస్తున్న బాలుర పాఠశాల, కళాశాలలను వచ్చే రెండు, మూడు నెలల్లో చించోలి క్యాంపస్‌కు తరలిస్తామని, బాలికల విద్యాసంస్థలు వచ్చే విద్యా సంవత్సరం నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయని అధికారులు పేర్కొంటున్నారు.
నిర్మల్, జూన్ 16(నమస్తే తెలంగాణ) : నిర్మల్ జిల్లాలో మైనారిటీ విద్యకు మహర్దశ పట్టబోతున్నది. రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించడమే కాకుండా, కొత్త విద్యాసంస్థల ఏర్పాటుకు నడుం బిగించింది. నిర్మల్‌ను మైనారిటీలకు ప్రత్యేక ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తలపెట్టారు. ఇందులో భాగంగా జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న చించోలి వద్ద ప్రస్తుతం పదెకరాలకుపైగా భూమి సేకరించి మైనారిటీ ఎడ్యుకేషన్ క్యాంపస్ నిర్మిస్తున్నారు. రూ.100 కోట్లు కేటాయించగా.. మొదటి వి డుతగా రూ.50 కోట్లతో పనులు చేపడుతున్నారు.
ప్రస్తుతం బాలురు, బాలికలకు వేర్వేగా హాస్టళ్లు, హైస్కూల్, ఇంటర్ స్థాయి విద్యనందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. హాస్టల్ భవనం, డైనింగ్ హాల్స్, కా మన్ సర్వీస్ సెంటర్, మైనార్టీ బాలికల కోసం హాస్టల్, కాలేజీని కూడా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం తాత్కాలికంగా నిర్మల్‌లో బాలురు, బాలికలకు సంబంధించిన హైస్కూల్ స్థాయి విద్యతోపాటు కాలేజీ విద్య కోసం కూడా ఏర్పాట్లు చేశారు. వీటితోపాటు నిర్మల్‌లో బాలికలు, భైంసా, ముథోల్, ఖానాపూర్‌లో బాలురు, ముథోల్‌లో బాలికల విద్యా సంస్థలను ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్నారు.
కాగా.. కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ పలుమార్లు సందర్శించి యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. ఇటీవల మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మైనారిటీ ఎడ్యుకేషన్ క్యాంపస్‌ను సందర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మైనారిటీల సంక్షేమం, విద్య, మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యతనిచ్చి అండగా నిలుస్తున్నారు.
మైనారిటీ క్యాంపస్‌లో విద్యార్థుల కోసం ఆధునిక సౌకర్యాలను సమకూరుస్తున్నారు. టెక్నికల్ విద్యను అందించేందుకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. అలాగే విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికి తీసేందుకు ప్రత్యేకంగా ఇక్కడ కామన్ సర్వీస్ సెంటర్‌ను నిర్మించారు. ఈ సెంటర్లో ఒకేసారి 200 మందికి పైగా విద్యార్థులు సమావేశమై తమ నైపుణ్యాన్ని ఒకరితో మరొకరు పంచుకునే అవకాశం ఉంటుంది.
తద్వార కొత్త కొత్త ఆవిష్కరణలు జరిగే ఆస్కారం ఉంటుందని మేధావులు అభిప్రాయ పడుతున్నారు. సాధారణ విద్యతోపాటు శాస్త్ర, సాంకేతిక రంగాలపై కూడా పట్టు పెంచుకునేందుకు అవసరమైన టెక్నికల్ ఎడ్యుకేషన్‌ను అందించనున్నారు. యూనివర్సిటీ తరహాలో క్యాంపస్‌ను నిర్మిస్తున్నారు.
ఈ విద్యాసంస్థల్లో బోధించే టీచర్లకు కూడా వసతి సౌకర్యం కల్పించేందుకు క్యాంపస్ ఆవరణలోనే క్వార్టర్లను నిర్మిస్తున్నారు. దీంతో విద్యార్థులను నిరంతరం పర్యవేక్షించే అవకాశం ఉంటుంది. ఇక్కడ చేరిన ప్రతి విద్యార్థికి ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత స్థాయి విద్య పొందే వరకు ఉచిత వసతి, నాణ్యమైన విద్యను అందించనున్నారు.
క్యాంపస్‌ను త్వరలోనే అందుబాటులోకి తెస్తాం. బాలుర విభాగాల్లో నిర్మించిన స్కూ ల్, కాలేజీ, హాస్టల్ భవనాలు 90 శాతానికి పైగా పూర్తయ్యాయి. నిర్మల్‌లోని అద్దె భవనంలో నిర్వహిస్తున్న బా లుర పాఠశాల, కళాశాలలను వచ్చే రెండు మూడు నెలల్లో చించోలి క్యాంపస్‌కు తరలిస్తాం. బాలికల విద్యాసంస్థలు వచ్చే విద్యా సంవత్సరం నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయి.
బీ.స్రవంతి, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి, నిర్మల్