ఆదిలాబాద్ రూరల్, జూన్ 16 : ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరూ తప్పని సరిగా వ్యాయామం చేయాలని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. గురువారం పట్టణ ప్రగతిలో భాగంగా డైట్ కళాశాలలో ఏర్పాటు చేసిన పట్టణ మైదానాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగా వల్ల శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆనందం కలుగుతుందన్నారు. అనంతరం యువకులతో కలిసి వాలీబాల్ ఆడారు. జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ క్రీడా మైదానాలను యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, వైస్‌చైర్మన్ జహీర్ రంజానీ, మున్సిపల్ కమిషనర్ శైలజ, డీఈ తిరుపతి పాల్గొన్నారు.
ఆదిలాబాద్ రూరల్, జూన్ 16 : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. గురువారం మావల మండలంలోని వాఘాపూర్‌లో మన ఊరు మనబడి కార్యక్రమంలో పాల్గొని క్రీడామైదానం, సవారీ బంగ్లా, ఎస్టీ కమ్యూనిటీ హాల్ భవనాలకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ నల్లావణిత, ఎంపీపీ చందాల ఈశ్వరీ, సర్పంచ్ మయూరి, నాయకులు నల్లా రాజేశ్వర్, చందాల ఈశ్వరి, డీఈవో టామ్నె ప్రణీత గ్రామస్తులు పాల్గొన్నారు.
అట్టడుగువర్గాలకు విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ కామర్స్ కళాశాల వార్షికోత్సవంలో పాల్గొని విద్యార్థులకు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో డీసీసీబీ అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, మున్సిపల్ వైస్‌చైర్మన్ జహీర్ రంజానీ, ప్రిన్సిపల్ అనిత పాల్గొన్నారు.
సంపూర్ణ ఆరోగ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయుష్(రిమ్స్) ఆధ్వర్యంలో గురువారం ఉదయం రిమ్స్ నుంచి బస్టాండు వరకు నిర్వహించిన అవగాహన ర్యాలీలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్నతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఆరోగ్యంగా ఉండేందుకు నిత్యం యోగా సాధనతో రోగనిరోధక శక్తి పెరుగుతుందన్నారు. ఈ నెల 21న స్థానిక రెవెన్యూ గార్డెన్లో నిర్వహించే ప్రపంచ యోగ దినోత్సవాన్ని విజయవంతం చేయాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ శారీరక, మానసిక దృఢత్వానికి యోగా దోహదపడుతుందని పేర్కొన్నారు. అవగాహన ర్యాలీలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, మున్సిపల్ కమిషనర్ శైలజ, యునాని సీనియర్ మెడికల్ ఆఫీసర్లు, నోడల్ ఆధికారి డాక్టర్ ఫరీదాబేగం, పట్టణ ప్రముఖులు, అధికారులు పాల్గొన్నారు.