కార్మికుల అభ్యున్నతి, సంక్షేమంలో మణుగూరు ఏరియా దూసుకెళ్తున్నది. ఉత్పత్తి,
ఉత్పాదకతలో తనదైన శైలిలో ఎప్పటికప్పుడు రికార్డులు బద్దలుకొడుతూ కోల్‌బెల్ట్ వ్యాప్తంగా తన స్థానాన్ని పదిలం చేసుకుంటున్నది. టీబీజీఏఎస్.. కోరిన వెంటనే నిధులు మంజూరుచేస్తూ కార్మికుల సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యమిస్తున్నది. అందులో భాగంగా పీవీ కాలనీలోని కమ్యూనిటీ హాలును ఆధునిక హంగులతో ఏసీ కమ్యూనిటీ హాలుగా ఏర్పాటు చేయించింది. కార్మికుల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
– మణుగూరు రూరల్, జూన్ 11
మణుగూరు ఏరియాలో కార్మికులు కుటుంబ సభ్యులతో శుభకార్యం నిర్వహించాలంటే పట్టణంలోని వివిధ ఫంక్షన్ హాళ్లను ఆశ్రయించేవారు. ఈ నేపథ్యంలో పీవీ కాలనీలో అందుబాటులో ఉన్న కమ్యూనిటీహాల్‌ను ఆధునీకరించాలని పలుమార్లు టీబీజీకేఎస్ నేత వీ ప్రభాకర్‌రావు పలు సమావేశాల్లో సీఎండీ శ్రీధర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతోపాటు ఏరియా పర్యటనకు వచ్చిన ఉన్నతాధికారులకు దాని ఆవశ్యకతను, ఎన్నో ఏండ్లుగా కార్మికుల నుంచి ఉన్న కోరికను వివరించారు. అలాగే ప్రాతినిధ్య సంఘాల నుంచి డిమాండ్ ఉన్నప్పటికీ కాగితాలకే పరిమితమైంది. అయినా టీబీజీకేఎస్ నేతలు సీఎండీతో పాటు ఉన్నతాధికారులకు సమస్యను వివరిస్తూ వచ్చారు. దీంతో స్పందించిన ఉన్నతాధికారులు ఏసీ కమ్యూనిటీ హాలుగా ఆధునీకరించేందుకు అనుమతులు ఇచ్చారు. రూ.19 లక్షలు మంజూరుచేశారు.
ప్రస్తుతం ఉన్న కమ్యూనిటీ హాలు ఆధునీకరణకు రూ.19 లక్షలు మంజూరు చేశారు. కాగా, మొత్తం 12 ఏసీలు, ఆర్మ్స్మ్రామ్ సీలింగ్, ఫ్లోర్ టైల్స్, అల్యూమినీయం గ్లాస్ తలుపులు, డైనింగ్‌హాల్, కలరింగ్ అనింటినీ నెలన్నర వ్యవధిలోనే పూర్తిచేశారు. కార్పొరేట్ స్థాయిలో ఉన్న ఈ ఏసీ కమ్యూనిటీహాల్ సౌకర్యాలు చూసి, కార్మిక కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. సాధారణ ఛార్జీలతో శుభకార్యాలు జరుపుకునే కుటుంబాలపై ఆర్థిక భారం పడకుండా సాధారణ ధరలకు అందుబాటులోకి తీసుకురావడంపై టీబీజీకేఎస్ నేతలకు ధన్యవాదాలు తెలుపుతున్నారు.
పీవీ కాలనీలోని కమ్యూనిటీహాల్‌ను ఏసీ కమ్యూనిటీహాల్గా ఆధునీకరించాలని టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఈ మేరకు స్పందించి, కార్మికుల సౌకర్యార్థం శుభకార్యాలకు ఏసీ కమ్యూనిటీహాల్గా మార్చడం అభినందనీయం. సింగరేణి సీఎండీ శ్రీధర్, డైరెక్టర్(పా) బలరాం, ఏరియా జీఎం జక్కం రమేశ్‌కు యూనియన్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు.
– వీ ప్రభాకర్‌రావు, బ్రాంచ్ ఉపాధ్యక్షుడు, టీబీజీకేఎస్