ఎదులాపురం, జూన్ 11 : కళాశాల విద్యార్థులు రక్తదానం చేయడం అభినందనీయమని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. పట్టణంలోని గిరిజన సంక్షేమ బాలుర డిగ్రీ కళాశాల(బోథ్)లో శనివారం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్న అమె ప్రారంభించారు. రక్తదానం మహాదానమన్నారు.
ఇందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. జిల్లాలో ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో రక్తహీనతతో బాధపడుతున్న చిన్నారులు, గర్భిణులు, బాలింతలు పెద్దసంఖ్యలో ఉన్నారన్నారు. జిల్లా మహిళా శిశు సంక్షేమ, వైద్య శాఖల ఆధ్వర్యంలో రక్తహీనత నివారణకు అనేక అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో పాటు గుడ్లు, పౌష్టికాహారం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఐరన్ మాత్రలను అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
రిమ్స్‌లో వివిధ చికిత్సలు పొందుతున్న రోగులు, రోడ్డు ప్రమాదాలకు గురైన వారికి పెద్ద మొత్తంలో రక్తం అవసరమవుతుందన్నా రు. రక్తదానంతో మరొకరి ప్రాణాన్ని కాపాడవచ్చని, యువత, స్వచ్ఛంద సంస్థలు రక్తదాన శిబిరాల ఏర్పాటుకు ముందుకు రావాలని సూచించారు. అనంతరం ఐఐటీలో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను సన్మానించి అ భినందించారు. డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్, తహసీల్దార్ సతీశ్, కళాశాల అధ్యాపకులు, గిరిజన నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఆదిలాబాద్ రూరల్, జూన్ 11 : వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. మావల మండలంలోని బట్టిసావర్గంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. పల్లె ప్రకృతి వనం, గ్రామంలోని పారిశుధ్యాన్ని పరిశీలించారు. రహదారులకు ఇరువైపులా మొక్కలు పెంచాలని, పాఠశాలలు, వైకుంఠ ధామాలను సుందరంగా తీర్చిదిద్దాలని సూచించారు.
ప్రతి మండలంలో యువత కోసం గ్రామీణ క్రీడా ప్రాంగణాలను ఎంపిక చేస్తూ వారికి అందుబాటులో ఉంచాలన్నారు. జడ్పీసీఈవో గణపతి, జడ్పీటీసీ నల్లా వనిత, ఎంపీపీ చందాల ఈశ్వరి, సర్పంచ్ రాగం గంగమ్మ, నాయకులు నల్లా రాజేశ్వర్, చందాల రాజన్న, రాగం గోవర్ధన్, గణపతి రెడ్డి పాల్గొన్నారు.