ఆదిలాబాద్ టౌన్, జూన్ 11 : సీఎం కేసీఆర్ గ్రామాలు, పట్టణాల సమగ్ర అభివృద్ధి కోసం పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను సమర్థవంతంగా రూపొందించి, అమలు చేయిస్తున్నారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలం న్యూ రాంపూర్‌లో నిర్వహిస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమంలో శనివారం అధికారులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ప్రకృతి వనం, నర్సరీని పరిశీలించారు. సవారీబంగ్లా షెడ్డు కోసం భూమి పూజ చేశారు.
గ్రామస్తుల సమస్యలను సావధానంగా విని, వారంలోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పల్లె, పట్టణ ప్రగతితో ప్రజలకు ప్రయోజనం చేకూరుతున్నదన్నారు. తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్న పథకాలు ప్రపంచ వ్యవసాయ దేశాల్లో ఎక్కడా లేవన్నారు. అన్ని వర్గాలకు అవసరమైన పథకాలు, శాశ్వత అభివృద్ధి పనులు చేస్తున్న సీఎం కేసీఆర్ మహానేత అని గుర్తుచేశారు. ఇంకా ఇరవై ఏండ్లపాటు టీఆర్ఎస్ పాలనే కొనసాగుతుందని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ గండ్రత్ రమేశ్, సర్పంచ్ వెంకట్, నాయకులు, గ్రామస్తులు ఉన్నారు.
ఆదిలాబాద్ రూరల్, జూన్ 11 : పట్టణ ప్రగతిలో భాగంగా పట్టణంలోని 45వ వార్డులో ఎమ్మెల్యే జోగు రామన్న మురుగుకాలువలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణ ప్రజల ఆరోగ్యం కోసం ఎంతకైనా తెగిస్తామని స్పష్టం చేశారు. పట్టణ ప్రగతిలో భాగంగా పరిశుభ్రతకు మొదటి ప్రాధాన్యమిస్తున్నామన్నారు.
పట్టణాభివృద్ధి కోసం కేంద్రం భారీగా నిధులు ఇస్తున్నదంటున్న బీజేపీ నాయకులు, కార్యక్రమాల్లో ఎందుకు పాల్గొనడంలేదని ప్రశ్నించారు. రాష్ర్టానికి రావాల్సిన నిధులపై బీజేపీ నాయకులు ఎందుకు మాట్లాడడం లేదని విమర్శించారు. వార్డులో ఓపెన్ జిమ్‌లను ఏర్పాటు చేస్తూ ప్రజలకు ఆహ్లాదకర వాతావరణంతో పాటు వ్యాయామం అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, వైస్‌చైర్మన్ జహీర్ రంజానీ, నాయకులు పాల్గొన్నారు.