నిర్మల్ అర్బన్, జూన్ 4 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె, పట్టణ ప్రగతిలో అందరూ భాగస్వాములవ్వాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు. నిర్మల్ పట్టణంలోని రాంరావ్బాగ్-నాయుడివాడ, కాలనీల్లో శనివారం నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రూపురేఖలు మారిపోయాయన్నారు.
పట్టణ ప్రగతి నిధుల ద్వారా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీకి ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులను విడుదల చేస్తున్నదని పేర్కొన్నారు. అందు భాగంగా నిర్మల్ మున్సిపాలిటీకి ప్రతి నెలా రూ.80 లక్షలు మంజూరవుతున్నాయని తెలిపారు. వార్డుల అభివృద్ధికి ఖర్చుచేయడం ద్వారా పట్టణ రూపురేఖలు మారిపోయాయన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా చేపట్టాల్సిన పనులు, గత పట్టణ ప్రగతిలో చేసిన అభివృద్ధి పనులను వివరించారు.
అభివృద్ధి, పారిశుధ్య పనులను మున్సిపాలిటీ సిబ్బంది విధిగా చేపట్టాలని సూచించారు. జౌళినాళా పరీవాహక ప్రాంత ప్రజలు ఇంట్లోని చెత్తను కాలువలో పడేయవద్దని, తద్వారా వాధ్యులు దూరమవుతాయన్నారు. గత వర్షాకాలంలో నిర్మల్‌లో భారీ వర్షాలు కురిసినప్పటికీ ఆ ప్రాంత ప్రజలు ఇబ్బందులకు గురికాలేదని తెలిపారు. అందుకు గత పట్టణ ప్రగతి కార్యక్రమం విజయవంతమవడమే కారణమన్నారు. లేకుంటే చిన్నపాటి వర్షానికే నీళ్లు ఇండ్లలోకి వచ్చేవని, దూర దృష్టితో ప్రభుత్వం ఇలాంటి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల్లో పల్లె ప్రగతి విజయవంతంగా కొనసాగుతున్నదన్నారు. కొన్ని వార్డుల్లో అనుకున్న స్థాయిలో పనులు సాగడం లేదని అధికారులు అలసత్వం వీడాలని ఆదేశించారు. నిర్మల్‌కు జిల్లా కోర్టును తీసుకువచ్చామని, ఇక నుంచి అన్ని రకాల కేసులు నిర్మల్ కోర్టు సముదాయ భవనంలోనే జరుగుతాయని తెలిపారు. అనంతరం మంజులాపూర్ కాలనీలోని ప్రభుత్వ సెకండరీ పాఠశాలలో ఏర్పాటు చేసిన క్రీడా మైదానాన్ని ప్రారంభించారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి మోదీ ప్రభుత్వం తెలంగాణకు చేసిందేమీ లేదని మంత్రి అన్నారు. సీఎం కేసీఆర్ ముందు చూపుతో రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిచేస్తున్నారని, అది చూసి ఓర్వలేకనే కేంద్రం తెలంగాణపై వివక్ష చూపుతున్నదని మండిపడ్డారు. రాష్ర్టానికి రావాల్సిన నిధులను కూడా కేటాయించడంలేదన్నారు. పన్నుల రూపంలో మన వద్ద నుంచి తీసుకుంటున్నదే తప్ప నిధులు మంజూరు చేయడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు మనుగడ లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, కౌన్సిలర్ ఆదుముల్ల రమాదేవీపద్మాకర్, మున్సిపల్ కమిషనర్ సంపత్, ఆయా శాఖల అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
మంత్రి క్యాంపు కార్యాలయంలో అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిని వైఎస్సార్సీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన ఎస్ నిరంజన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి ఆయనను అభినందించి, శుభాకంక్షలు తెలిపారు. నిర్మల్‌కు చెందిన నిరంజన్ రెడ్డిని రాజ్యసభకు నామినేట్ చేసినందుకు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌కు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. వారి వెంట నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, నాయకులు మారుగొండ రాము, మోహినొద్దీన్, డాక్టర్ దేవేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయ బంగారు తాపడం నిర్మాణం కోసం మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డికి తన పీఏ నాలం శ్రీనివాస్ రూ.51వేలు విరాళంగా అందజేశారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో సంబంధిత రశీదును శ్రీనివాస్‌కు అందజేసి, అభినందించారు. మంత్రి అల్లోల మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ యాదాద్రి ఆలయాన్ని అద్బుతంగా నిర్మించారన్నారు. ఆలయానికి భక్తులు అనేక విధాలుగా సహకారం అందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఎస్సీఎస్ మాజీ చైర్మన్ రాంకిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రాజ్యసభకు ఎంపికైన ‘నమస్తే తెలంగాణ’ సీఎండీ దీవకొం డ దామోదర్ రావు, డాక్టర్ బండి పార్థసారథి రెడ్డికి మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి శనివారం ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.
సోన్, జూన్ 4 : నిర్మల్ మండలంలోని రత్నాపూర్‌కాండ్లీ శివారులో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్‌ను శనివారం మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ప్రారంభించారు. జిల్లా ఏర్పాటు తర్వాత చుట్టు పక్కల వాణిజ్య వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతున్నదన్నారు. జాతీయ రహదారుల అభివృద్ధి జరుగుతున్న నేపథ్యంలో పెట్రోల్ బంక్‌లు కొత్తగా ఏర్పాటు చేయడం వల్ల వాహనదారులకు మరింత సౌకర్యవంతంగా ఉంటుందని పేర్కొన్నారు. బంక్ నిర్వాహకులకు మంత్రి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వీ సత్యనారాయణగౌడ్, ఎంపీపీ కొరిపెల్లి రామేశ్వర్‌రెడ్డి, నిర్వాహకులు శ్రీధర్‌రావు, టీఆర్ఎస్ పార్టీ మా జీ అధ్యక్షుడు శ్రీహరిరావు, స్థానిక నాయకులు తదితరులుపాల్గొన్నారు.