ఎదులాపురం, జూన్ 4 : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఈ నెల 26న జరిగే జాతీయ లోక్ అదాలత్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ సునీత సూచించారు. జిల్లా కోర్టు సమావేశ మందిరంలో ఎస్పీ డీ ఉదయ్‌కుమార్, న్యాయమూర్తులు, పీపీలు, న్యాయవాదాలు, పోలీసు అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ.. అందరినీ సమన్వయం చేస్తూ రాజీపడేలా కేసులను పరిష్కరించాలన్నారు. చిన్నచిన్న లోపాలు ఉన్నా దృష్టికి తీసుకువస్తే పరిష్కరించే దిశగా కృషి చేస్తామని తెలిపారు.
రాజీ మార్గంలో కేసులను పరిష్కరించేందుకు జాతీయలోక్ అదాలత్ అరుదైన అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. ఇందులో పరిష్కరించిన కేసులను ఉన్నత కోర్టుకు వెళ్లి అప్పీల్ చేసేందుకు వీలుండదన్నారు. వాయిదాలతో న్యాయస్థానం చుట్టూ తిరిగే అవసరం లేదని, సమయం వృథా కాకుండా ఉంటుందని, జిల్లా ప్రజలు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో రాజీకి అనువైన కేసుల దర్యాప్తు వెంటనే పూర్తిచేసి, తుది నివేదిక న్యాయస్థానంలో సమర్పించాలన్నారు. అలాగే లోక్‌అదాలత్‌పై విస్తృత ప్రచారం చేసి, కక్షిదారులు, బాధితులకు సమచారం అందించాలని సూచించారు.
అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. త్వరగా కేసులు పరిష్కరించేందుకు లోక్ అదాలత్ మంచి అవకాశమని, పోలీస్ కేసులు ఉన్న వారందరికీ సమాచారం అందిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో మొదటి అదనపు సెషన్ జడ్జి డీ మాధవీకృష్ణ, ఎస్సీ, ఎస్టీ కోర్టు జడ్జి డీ సతీశ్ కుమార్, సబ్ కోర్టు సీనియర్ సివిల్ జడ్జి జీ ఉదయ్ భాస్కర్‌రావు, పీసీఆర్ కోర్టు జడ్జి వై యశ్వంత్‌సింగ్ చౌహాన్, జడ్జి మంజులాసూర్యవార్, బార్ అసోసియేషన్ చైర్మన్ ఎర్రల నగేశ్, పీపీలు కిరణ్ కుమార్ రెడ్డి, ముస్కు రమణారెడ్డి, సంజయ్వైరాగరే, మేకల మధూకర్, ఏపీపీ కిరణ్, డీఎస్పీ వీ ఉమేందర్, సీఐలు, ఎస్ఐలు తదితరులు ఉన్నారు.