ఐదో విడుత పల్లె, నాలుగో విడుత పట్టణ ప్రగతి కార్యక్రమాలు శుక్రవారం ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో పండుగలా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి ర్యాలీలు తీశారు. పారిశుధ్య పనులు చేపట్టి.. మొక్కలు నాటారు. సభలు, సమావేశాలు నిర్వహించి 15 రోజుల పాటు చేపట్టబోయే పనులపై చర్చించారు. నిర్మల్ జిల్లాలోని మామడ, దిలావర్పూర్ మండలాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పాల్గొనగా, తమ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు హాజరై వివిధ అంశాలపై సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. ఆయా చోట్ల క్రీడా ప్రాంగణాలు ప్రారంభించారు. సీఎం కేసీఆర్ ద్వారానే పల్లెల్లో గ్రామ స్వరాజ్యం కనిపిస్తోందని మంత్రి అల్లోల స్పష్టం చేశారు.
ఆదిలాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): గ్రామాలు, మున్సిపాలిటీల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం చేపడుతున్న పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమం ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో శుక్రవారం ప్రారంభమైంది. 15 రోజుల పాటు కొనసాగనుంది. వివిధ కార్యక్రమాల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రెండు జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు, స్థానికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
రెండు జిల్లాల పరిధిలోని నాలుగు మున్సిపాలిటీలు, 864 గ్రామ పంచాయతీల్లో శుక్రవారం వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణాలు, పల్లెల్లో పరిశుభ్రత, పచ్చదనంలో భాగంగా చేపట్టిన ఈ కార్యక్రమంతో గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి నిర్మల్ జిల్లా మామడ మండలం గాయిద్ పల్లి, నిర్మల్ రూరల్ మండలం చిట్యాల, దిలావర్పూర్ మండలం లోలంలో పల్లెప్రగతి కార్యక్రమాలకు హాజరయ్యారు. ఆదిలాబాద్ జిల్లా బేల మండలం పొన్నాలలో జరిగిన పల్లెప్రగతి కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పాల్గొన్నారు. నార్నూర్‌లో జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, కలెక్టర్ సిక్తా పట్నాయక్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా అధికారులు గ్రామాల్లో పనులను పరిశీలించి మొక్కలు నాటారు.
ప్రభుత్వం చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాల్లో గ్రామ స్వరాజ్యం వచ్చిందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. గతంలో గ్రామాల్లో ఆపరిశుభ్రమైన వాతావరణం, పేరుకుపోయిన చెత్తా చెదారం, మురుగు కాలువల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండేదన్నారు. పల్లెప్రగతితో గ్రామాల్లో పరిశుభ్రత, పచ్చదనం నెలకొనడంతో పాటు పల్లెల రూపురేఖలు మారిపోయాయని తెలిపారు. పంచాయతీలకు ప్రభుత్వం ప్రతి నెలా మంజూరు చేస్తున్న నిధులతో, గ్రామాలు అభివృద్ధిలో దూసుకెళ్తున్నాయని స్పష్టం చేశారు.
పల్లెప్రగతి ద్వారా గ్రామాల్లో పలు సమస్యలకు పరి ష్కారం లభిం చిందన్నారు. బేల మండలం పొన్నాలలో ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగాన్ని నివారించాలని సూచించారు. గ్రామా లు పరిశుభ్రంగా మారడంతో ప్రజలకు వ్యాధుల బాధ లేకుండా పోయిందని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధిని ఓర్వలేని కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీల కూలీలకు డబ్బులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నదని మండిపడ్డారు.
