బేల, జూన్ 3 : కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ కూలీలను విస్మరిస్తోందని, టీఆర్ఎస్ ప్రభుత్వానికి మంచి పేరు రావడాన్ని చూసి ఓర్వలేక కేంద్రం ఆన్లైన్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చి కూలీల డబ్బులను ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు.
పల్లె ప్రగతి దో విడుతలో భాగంగా బేల మండలంలోని పొనాల గ్రామంలో చేపట్టిన కార్యక్రమాల్లో శుక్రవారం ఎమ్మెల్యే జోగు రామన్న, జిల్లా అదనపు కలెక్టర్ రిజ్వాన్ షేక్ బాషా ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. పల్లె ప్రగతిలోని ముఖ్య అంశాలను గ్రామసభ నిర్వహించి వివరించారు. మొదటగా గ్రామంలో పల్లె ప్రగతి ర్యాలీని నిర్వహించి పలు విషయాలపై అవగాహన కల్పించారు. గ్రామంలో ఏఏ సమస్యలు ఉన్నాయో ఇంటింటికీ తిరుగుతూ గ్రామ స్తులను అడిగి తెలుసుకున్నారు. ప్లాస్టిక్ వినియోగం ప్రమాదకరమని సూచించారు.
పల్లె ప్రగతి కార్యక్రమంలో గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక కమిటీలు వేసి అభివృద్ధి కార్య క్రమాలు చేపట్టినట్లు తెలిపారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, ఎంపీపీ వనిత ఠాక్రె, నాయకులు గంభీర్ ఠాక్రె, ప్రమోద్‌రెడ్డి, మస్కే తేజ్రావ్, బాల్‌చందర్, సర్పంచ్ కుడ్మెత యశోద, ఎంపీటీసీ సకారం, ఎంపీడీవో భగత్ రవీందర్, ఎంపీవో సమీర్ హైమద్, గ్రామస్తులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు ఆకర్షితులై ప్రజలు టీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. మండలంలోని పొనాల, రంఖం గ్రామాలకు చెందిన వందలాది మంది ఎమ్మెల్యే జోగు రామన్న సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. పొనాల గ్రామానికి చెందిన రిటైర్డ్ టీచర్ కొడపె భీంరావ్తో పాటు 200 మంది పురుషులు, 70 మంది మహిళలు టీఆర్ఎస్లో చేరారు. రంఖం గ్రామంలో మరో 150 మంది చేరగా.. ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పి టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు.
బేల మండలంలో గతంలో కంటే టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, నాయకులు మెట్టు ప్రహ్లాద్, గంభీర్ ఠాక్రె, ప్రమోద్‌రెడ్డి, మస్కే తేజ్రావ్, తన్వీర్ ఖాన్, సకారాం, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.