‘తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు బంగారు తెలంగాణ కోసం ధృఢ సంకల్పంతో ఉన్నారు. ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. వివిధ రంగాల్లో రాష్ట్రం సాధించిన ప్రగతి, అమలు చేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలువడం గర్వకారణం’ అని ప్రభుత్వ విప్‌లు బాల్క సుమన్, అరికెపూడి గాంధీ పేర్కొన్నారు. గురువారం మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రాల్లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్‌రావు, కోనేరు కోనప్ప, ఆత్రం సక్కు, జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి, కలెక్టర్లు భారతీ హోళికేరి, రాహుల్‌రాజ్‌తో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొదట పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. తెలంగాణ అమరులకు నివాళులర్పించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. జాతీయ జెండాను ఆవిష్కరించారు. ‘దళితబంధు’ లబ్ధిదారులకు వాహనాలు అందజేశారు.
మంచిర్యాల, జూన్ 2 (నమస్తే తెలంగాణ : బంగారు తెలంగాణలో, అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పిలుపునిచ్చారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, కలెక్టర్ భారతీ హోళీకేరి, అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్‌తో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జాతీయ జెండాను ఎగురవేశారు. అంతకుముందు జిల్లాకేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు.
తెలంగాణ తల్లి విగ్రహానికి పూల మాల వేశారు. అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఆయన మాటల్లోనే.. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చాలన్న ధృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అనతి కాలంలోనే అనేక పథకాలకు రూపకల్పన చేసి అమలు చేస్తున్నారు. వివిధ రంగాల్లో రాష్ట్రం సాధించిన ప్రగతి, అమలు చేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. విదేశాల నుంచి సైతం ప్రశంసలు అందుతున్నాయి. జాతీయ స్థాయిలో మన రాష్ట్రం సాధించిన అవార్డులు సమర్థవంతంగా సాగుతున్న పరిపాలనకు గీటురాళ్లు. ప్రణాళికాబద్ధమైన విధానాలు, ఆర్థిక క్రమశిక్షణ, ప్రజలదీవెనలతో అన్ని రంగాల్లో రాష్ట్రం ముందడుగు వేస్తున్నది. అందరి సహకారంతో జిల్లా సర్వతోముఖాభివృద్ధి చెందుతుంది.
ఆసిఫాబాద్, జూన్ 2 : కరోనాతో దేశం మొత్తం సంక్షోభంలో పడినా తెలంగాణలో మాత్రం పథకాల అమలులో సీఎం కేసీఆర్ రాజీపడింది లేదని ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీ పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయ ఆవరణలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు జడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మి, ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, ఆత్రం సక్కు, కలెక్టర్ రాహుల్‌రాజ్, ఎస్పీ సురేశ్‌కుమార్, అదనపు కలెక్టర్లు రాజేశం,వరుణ్ రెడ్డితో కలసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అమరవీరుల స్తూపం వద్ద పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం, అమరవీరులకు నివాళులర్పించారు.
అనంతరం కలెక్టరేట్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమరుల త్యాగాలతో, కేసీఆర్ మొక్కవోని దీక్షతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైందని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పడి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. అనంతరం జిల్లాలో జరుగుతున్న ప్రగతిని వివరించారు. అంతకుముందు కాగజ్‌నగర్‌కు చెందిన బిట్ల వెంకటస్వామి నృత్యకళాకారుడి శిశువులు వేధశ్రీ,విశ్వజ చేసిన నృత్యం ఆకట్టుకుంది. సాయంత్రం నిర్వహించిన కవి సమ్మేళనానికి అనుహ్య స్పందన లభించింది. సాలేగూడలో ఏర్పాటు చేసిన క్రీడా మైదానాన్ని విప్ ప్రారంభించారు.
జిల్లాలోని 18 ఉత్తమ పంచాయతీలను ఎంపిక చేసి, ఆయా గ్రామాల సర్పంచులకు మెమొంటోలు అందజేశారు. జైనూర్ మండలం మార్లవాయి సర్పంచు ప్రతిభకు గోల్డ్ మెడల్ అందజేశారు. దహెగాం మండలం బీబ్రా సర్పంచ్ కృష్ణమూర్తి, రెబ్బెన మండలం కొండపల్లి సర్పంచ్ శాంతకు సిల్వర్ మెడల్స్ అందజేశారు.
మిగతా గ్రామాల సర్పంచులు లావణ్య,రీనా సర్ధార్,శ్యామల, మల్లేశ్, మౌనిశ్, కావ్య,లక్ష్మి, జే.లక్ష్మి, భీంరావు, నానేశ్వర్, లక్ష్మి, సోమశేఖర్, నాగోరావు, హన్మంత్‌రావు, సుమిత్రకు ప్రశంసాపత్రాలు అందించారు. అలాగే దళితబంధు పథకం ద్వారా మంజూరైన యూనిట్లను 22 మంది లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ కనక యాదవరావు,ఎంపీపీ మల్లికార్జున్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ గాదవెణి మల్లేశ్, ఏఎస్పీ అచ్చేశ్వర్రావు, డీఆర్వో కదం సురేశ్, ఆర్డీవో సిడాం దత్తు, డీఎస్పీ శ్రీనివాస్, డీడబ్ల్యూవో సావిత్రి, డీడీ మణెమ్మ, ప్రత్యేకాధికారి రమేశ్, ఎస్సీ, బీసీ సంక్షేమాధికారులు సజీవన్, సత్యనారాయణరెడ్డి, డీఆర్డీవో సురేందర్, వ్యవసాధికారి శ్రీనివాస్‌రావు, నాయకులు పాల్గొన్నారు. కాగా, జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఆయా శాఖల అధిపతులు జాతీయ జెండాలను ఆవిష్కరించారు.
