రామగిరి, మే 30 : ఓసీపీల్లో ఉత్పత్తి, రవాణా, ఉత్పాదకత లక్ష్యాలకు అనుకూలంగా యంత్రాల వినియోగం పెంచుకోవాలని అధికారులకు సింగరేణి డైరెక్టర్ (ఈఅండ్ఎం) డీ సత్యనారాయణరావు సూచించారు. ఆర్జీ-3 ఏరియాలో సోమవారం ఆయన పర్యటించారు. ముందుగా జీఎం కార్యాలయంలో ఆర్జీ-3 జీఎం మనోహర్‌తో పాటు, ఇతర అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఓసీపీ-2 వ్యూపాయింట్ నుంచి గనిలో నడుస్తున్న పనులను, క్వారీలో ఇటీవల మరమ్మతులు చేపట్టిన కే-9 షావల్‌ను, క్రషర్లు, తదితర యంత్రాల పనితీరును పరిశీలించారు.
పనుల వివరాలను డైరెక్టర్‌కు జీఎం వివరించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ.. నిర్దేశిత బొగ్గు, ఓబీ ఉత్పత్తి లక్ష్యాలు, రవాణాను రక్షణతో సాధించుకోవాలని సూచించారు. అందుకు యంత్రాల వినియోగ సామర్థ్యం మరింత పెంచుకోవాలన్నారు. వానకాలం దృష్ట్యా ఉత్పత్తికి ఆటంకం కలుగకుండా అంతర్గత రహదారులు ఏర్పాట్లలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని తెలిపారు. ఉత్పత్తిలో ప్రధాన పాత్ర పోషిస్తున్న యంత్రాలకు ముందస్తుగా మరమ్మతులు చేసుకొని, అందుబాటులో ఉండేలా చూసుకోవాలని సూచించారు.
అనంతరం ఏఎల్పీ గనిని సందర్శించి, అధికారులతో సమావేశమయ్యారు. పనుల వివరాలను తెలుసుకున్నారు. డైరెక్టర్ సత్యనారాయణ వెంట భూగర్భ గనుల జీఎం సూర్యకుమార్, ఎస్వోటూ జీఎం రఘుపతి, ఏరియా ఇంజినీర్ ఎలీషా, రాజశేఖర్ రెడ్డి, పీఈ వెంకటేశ్వరరావు, ఎస్ఈ జ్ఞాన సంబంధన్, సర్వే అధికారి లక్ష్మీరాజు, ఇన్చార్జి మేనేజర్ శంకర్, సేఫ్టీ అధికారి నారాయణతో పాటు ఇతర అధికారులు తదితరులు ఉన్నారు.