ప్రభుత్వ బడులను బలోపేతం చేసి నిరుపేద విద్యార్థులకు మెరుగైన విద్యనందించడమే ధ్యేయంగా రాష్ట్ర విద్యాశాఖ అనేక కార్యక్రమాలు చేపడుతున్నది. ఇందులో భాగంగా ఎప్పటిలాగే ఈ ఏడాదీ ప్రవేశాలు పెంచేందుకు ‘ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట’కు సన్నద్ధమైంది. జూన్ 1 నుంచి 12వ తేదీ వరకు ఊరూరా అవగాహన ర్యాలీలు నిర్వహించనుండగా, సర్కారు స్కూళ్లలో కల్పిస్తున్న సౌకర్యాలతో పాటు మధ్యాహ్న భోజనం, ఉచితంగా పాఠ్య పుస్తకాలు, స్కూల్ డ్రెస్సులు పంపిణీవంటివాటిపై విస్తృతంగా ప్రచారం చేయనున్నది. కాగా, ఈ విద్యాసంవత్సరం నుంచి అన్ని పాఠశాలల్లో ఆంగ్ల బోధన అమలు చేయనుండగా, అడ్మిషన్లు భారీగా పెరిగే అవకాశమున్నది.
ఆసిఫాబాద్, మే 30 : ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. ఇది వరకు పాఠశాలలు ప్రారంభమైన తర్వాత ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా, ఈ ఏడాది పాఠశాలలు పున:ప్రారంభానికి ముందుగానే చేపట్టాలని నిర్ణయించింది. జిల్లాలో జిల్లా పరిషత్, మండల పరిషత్, కేజీబీవీ, బీసీ, నవోదయ, సాంఘిక సంక్షేమ గురుకులాలు, మోడల్ స్కూళ్లు, గిరిజన, మైనార్టీ, గురుకులాలు, గిరిజన ఆశ్రమ, ఎయిడెడ్ పాఠశాలలు, అర్బన్ గురుకులాలు కలిపి మొత్తం 1259 పాఠశాలలున్నాయి. వీటిలో దాదాపు లక్ష మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.
జూన్ 1వ తేదీ నుంచి 12వ తేదీ వరకు బడిబాట కార్యక్రమాలు నిర్వహించనుండగా, 13వ తేదీన పాఠశాలలు పునఃప్రారంభించనున్నది. 12 రోజుల పాటు వాడ వాడలా ర్యాలీలు తీస్తూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించనున్నారు. ప్రభుత్వం సర్కారు బడుల్లో కల్పిస్తున్న సౌకర్యాలతో పాటు మధ్యాహ్న భోజనం, ఉచితంగా పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తుల పంపిణీ వంటి పథకాల గురించి వివరించనున్నారు. ప్రభుత్వం అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా విద్య అందిస్తున్నదని, నిరుపేదలకు ఇది వరమని, తల్లిదండ్రులు తమ పిల్లలను సర్కారు బడులకే పంపించాలని వివరించానున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇంగ్లిష్ మీడియం చదువులతో పాటు పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ‘మన ఊరు.. మన బడి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 2022-23 విద్యా సంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టనుండగా బడులకు కొత్త కళ రానుంది. గతంలో ప్రభుత్వ పాఠశాలలంటే శిథిలావస్థలో భవనాలు.. కూలిపోతున్న పైకప్పులు.. దర్శనమిచ్చేవి. వాటన్నిటికీ చెక్ పెడుతూ రాష్ట్ర సర్కారు పాఠశాలల మెరుగుపై ప్రత్యేక దృష్టి సారించింది. పాఠశాలల్లో కిచెన్ షెడ్లు, మరుగుదొడ్లు, మూత్ర శాలలు, కొత్త భవనాలు, ప్రహరీ నిర్మాణాలు, డిజిటల్ తరగతులు వంటి మౌలిక సదుపాయాలు సమకూరనున్నాయి. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు కట్టలేక, ఆంగ్ల విద్య అందుబాటులో లేక ఇప్పటికే చాలా మంది పాఠశాల విద్యకు దూరమవుతున్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల భారం భరించలేక, శిక్షణ పొందని ఉపాధ్యాయుల బోధనపై అసంతృప్తితో విద్యార్థులు ప్రైవేట్ బడుల నుంచి సర్కారు బడులకు వలసలు కడుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ నిర్ణయంతో ముఖ్యంగా పేదలకు ఎంతో మేలు కలుగుతుంది. ఈ నేపథ్యంలో ఈసారి సర్కారు బడుల్లో భారీగా ప్రవేశాలు పెరుగనున్నాయి.
నిర్మల్ టౌన్, మే 30 : బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులకు సూచించారు. హైదరాబాద్ నుంచి సోమవారం ఆయా జిల్లాల అధికారులతో బడిబాట కార్యక్రమంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ‘మన ఊరు-మన బడి’ ద్వారా మౌలిక సదుపాయాలు కల్పిస్తూనే బడిబాట ప్రాముఖ్యతను వివరించారు. వీసీలో నిర్మల్ కలెక్టరేట్ నుంచి డీఈవో రవీందర్రెడ్డి, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు జూన్ 1 నుంచి 12 వరకు జిల్లా వ్యాప్తంగా బడిబాట కార్యక్రమాన్ని స్థానిక ప్రజా ప్రతినిధులు, ఉపాధ్యాయులు, పలు శాఖల అధికారులతో సమన్వయం చేసుకొని విజయవంతం చేసేందుకు కృషి చేస్తాం. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అందించడం జరుగుతుంది. విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించి ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెంచేందుకు కృషి చేస్తాం. ఈ ఏడాది ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లిష్ మీడియం ప్రారంభం కానుంది. దీంతో పెద్ద సంఖ్యలో అడ్మిషన్లు అయ్యే అవకాశముంది.
– అశోక్, డీఈవో, కుమ్రం భీం ఆసిఫాబాద్