ఎదులాపురం, మే 30: కొవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన బాలల కోసం పీఎం కేర్స్ పథకం ప్రవేశ పెట్టామని ప్రధాన మంత్రి మోదీ అన్నారు. ఢిల్లీ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో సోమవారం వీడియోకాన్పరెన్స్ నిర్వహించారు. బాలల కోసం పీఎం కేర్స్ పథకం ప్రయోజనాలను ప్రధాని వెల్లడించారు. కరోనా మహమ్మారి కారణంగా చిన్నారులు తల్లిదండ్రులను కోల్పోవడం అత్యంత బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. అలాంటి పిల్లలకు పీఎం కేర్స్ పథకం ద్వారా ప్రయోజనాలు అందాలన్నారు. 2020 మార్చి 11 నుంచి 2022 ఫిబ్రవరి 28 మధ్య అనాథలైన బాలలు ఈ పథకం కింద లబ్ధి పొందడానికి అర్హులని తెలిపారు. ఈ పథకం కింద బాలలు తమ పేర్లు నమోదు చేసుకోవడానికి pmcaresforchildren.in పోర్టల్ ఏర్పా టు చేసినట్లు వెల్లడించారు. చిన్నారుల బంగారు భవిష్యత్‌ను ఆకాంక్షిస్తూ దేశం వేసిన ముందడుగే పీఎం కేర్స్ పథకం అని స్పష్టం చేశారు. పీఎం కేర్స్ పథకం పాస్ బుక్, ఆయుష్మాన్ భారత్ -ప్రధాన మంత్రి జనారోగ్య యోజన కార్డు , స్నేహపాత్ర సర్టిఫికెట్‌ను పిల్లలకు కలెక్టర్ సిక్తా పట్నాయక్ అందజేశారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, సంక్షేమ శాఖ అధికారులు మిల్కా, భగత్ సునీత, డీసీపీవో రాజేంద్ర ప్రసాద్, డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్, సీడబ్ల్యూసీ చైర్మన్ వెంకటస్వామి పాల్గొన్నారు.
నిర్మల్ టౌన్, మే 30 : కరోనా బాధితులను అన్ని విధాల ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఢిల్లీ నుంచి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల కలెక్టర్లతో మాట్లాడారు. కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు ప్రభుత్వం ద్వారా రూ. 10లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. ఈ పథకాన్ని 2021 మే 29న ప్రారంభించినట్ల తెలిపారు. అర్హులైన పిల్లలందరినీ గుర్తించి ఆర్థిక సాయం చేయాలని సూచించారు. 18 ఏళ్లు నిండిన తర్వాత బ్యాంకుల్లో వారి పేరిట రూ. 10లక్షలు చెల్లించనున్నట్లు తెలిపారు. బాధిత పిల్లలకు డీఆర్డీవో విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందించేందుకు కావాల్సిన డిపాజిట్ పత్రాలను అందించారు. కార్యక్రమంలో ఏవో శివప్రసాద్, సీడబ్ల్యూసీ నాయకుడు వహిద్, బాలల సంరక్షణ అధికారి మురళి, సిబ్బంది ఉన్నారు.