ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వానకాలంలో వ్యాధులు ప్రబలకుండా వైద్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. జూన్ 3 నుంచి ప్రారంభమయ్యే పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో వ్యాధులు రాకుండా చర్యలు చేపట్టనున్నారు. వైద్యశాఖ అధికారులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులతో సమావేశం నిర్వహించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. వైద్యశాఖ అధికారులు కూడా వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశాలు నిర్వహించారు. వర్షాలకు వాగులు పొంగే ప్రమాదం ఉండడంతో ఏజెన్సీ ప్రాంతాల్లోని గర్భిణులను ముందుగా బర్త్ వెయిటింగ్ రూంలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తీసుకొస్తున్నారు.
ఆదిలాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వానకాలం సమీపిస్తున్న నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. యేటా ఈ సీజన్లో మారుమూల గ్రామాలు, ఆదివాసీ గూడేలు, తండాల్లో మలేరియా, డయేరియా, డెంగీ లాంటి వ్యాధులు ప్రబలుతుంటాయి. వీటి నివారణకు అధికారులు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. సీజన్‌కు ముందుగానే వివిధ శాఖల అధికారులతో జిల్లా, మండల స్థాయిల్లో సమన్వయ సమావేశాలు నిర్వహించి ప్రణాళికలు తయారు చేస్తున్నారు. ఇందులో భాగంగా డీఎంహెచ్‌వో పీహెచ్సీ వైద్యులతో సమావేశం నిర్వహించి, పలు సలహాలు, సూచనలు చేశారు. మండల స్థాయిలో సైతం పీహెచ్సీ వైద్యులు వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేస్తారు. ప్రభావిత గ్రామాలు, వ్యాధులు ప్రబలడానికి గల కారణాలు, నివారణా చర్యలపై ప్రణాళికలు తయారు చేస్తారు.
జూన్ 3 నుంచి పట్టణ, పల్లెప్రగతి కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. గ్రామాల్లో దోమలు వృద్ధి చెందకుండా డ్రైనేజీల శుభ్రం, చెత్తాచెదారం లేకుండా చూస్తారు. వానలకు బోర్లు, బావులు, ఇతర తాగునీటి వనరుల్లో కొత్త నీరు ప్రవేశిస్తుంది. తాగునీరు కాలుషితం కాకుండా బావులు, బోర్ల వద్ద క్లోరినేషన్ చేస్తారు. దోమ తెరల వాడకం, పరిసరాల శుభ్రతపై అవగాహన కల్పిస్తారు.
వర్షాలతో వాగులు పొంగితే ఆదివాసీ గూడేలు, తండాల్లోకి రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. వాహనాలు వెళ్లే పరిస్థితులు ఉండవు. దీంతో ఆయా పల్లెల్లోని గర్భిణులు ప్రసవం కోసం దవాఖానలకు వచ్చేందుకు ఇబ్బందులు తప్పవు. దీంతో వారికోసం ప్రభుత్వం ఉట్నూర్, నార్నూర్‌లో బర్త్ వెయిటింగ్ రూంలు ఏర్పాటు చేశారు. వీటితో పాటు గాదిగూడ, ఇంద్రవెల్లి, ఝరి, బజార్హత్నూర్, పిట్టబొంగురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సైతం గర్భిణులు ఉండేందుకు ఏర్పాట్లు చేసినట్లు వైద్యశాఖ అధికారులు తెలిపారు. వైద్య సిబ్బంది గర్భిణులను ముందుగానే అంబులెన్స్‌ల్లో అందులోకి తరలిస్తారు. ప్రసవం అనంతరం తల్లీబిడ్డను కూడా అంబులెన్స్‌లో వారి ఇండ్లకు తీసుకెళ్తారు.
జిల్లాలో వానకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే జిల్లాలోని 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులతో సమావేశం నిర్వహించి పలు సలహాలు, సూచనలు చేశాం. వారు మండలాల్లో సైతం వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశాలు నిర్వహిస్తారు. పల్లెప్రగతిలో భాగంగా గ్రామాల్లో దోమల నివారణ కోసం చర్యలు తీసుకుంటాం. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తాం. రవాణా సౌకర్యం సరిగా లేని ప్రాంతాల్లోని గర్భిణులను ప్రసవం కోసం ముందుస్తుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తీసుకువచ్చి వైద్యం అందిస్తాం.
– నరేందర్ రాథోడ్, జిల్లా వైద్యశాఖ అధికారి, ఆదిలాబాద్