కడెం, మే 29 : పట్టణాల్లో మాత్రమే నిర్వహించే వారసంతలు.. ప్రస్తుతం పల్లెల్లోనూ దర్శనమిస్తున్నాయి. నిత్యావసరాలతో పాటు, కూరగాయాలు, ఇతర వస్తువులు స్థానికంగానే లభిస్తున్నాయి. వీడీసీ, గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో అన్ని వర్గాలకు అందుబాటులో ఉంటున్నాయి. గతంలో కడెంలో మాత్రమే ఉండగా.., ఇప్పుడు మండల కేంద్రంతో పాటు, లింగాపూర్, అల్లంపల్లి, ఎలగడప, ఉడుంపూర్ గ్రామాల్లో సైతం ఆదివారం మొదలుకొని శనివారం వరకు కొనసాగుతున్నాయి. కాగా, కడెం, జన్నారం, ఖానాపూర్, దండేపల్లి, ఉట్నూర్ ప్రాంతాల నుంచి వ్యాపారులు వచ్చి, సరుకులు విక్రయిస్తున్నారు.
కడెం మండల కేంద్రంలో ఉన్న వారసంత.. ఇప్పుడు, కడెంతో పాటు, మండలంలోని లింగాపూర్, అల్లంపల్లి, ఎలగడప, ఉడుంపూర్ గ్రామాల్లో సైతం ఆదివారం నుంచి మొదలుకొని శనివారం వరకు సంతలు కొనసాగుతున్నాయి. అలాగే నూతన మండలంగా ఏర్పాటైన దస్తురాబాద్‌లో కూడా అందుబాటులోకి వచ్చాయి. మండలకేంద్రంతో పాటు, మున్యాల్, రేవోజిపేట, బుట్టాపూర్ గ్రామాల్లోనూ నిర్వహణ కొనసాగుతున్నది. వీడీసీ, గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో వేలం వేసి, అక్కడే సంత నిర్వహిస్తున్నారు. ఇంతకుముందు దస్తురాబాద్ మండలవాసులు వారసంతల నిమిత్తం కడెం, జన్నారం వెళ్లాల్సి వచ్చేది.
కానీ, ప్రస్తుతం స్థానికంగానే వారసంతలు ప్రారంభమవడంతో సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. కడెం మండలకేంద్రంలో ప్రతి ఆదివారం/బుధవారం, లింగాపూర్‌లో మంగళవారం, అల్లంపల్లిలో గురువారం, ఉడుంపూర్, ఎలగడప గ్రామాల్లో శనివారం.., దస్తురాబాద్ మండలకేంద్రంలో శుక్రవారం, బుట్టాపూర్‌లో సోమవారం, మున్యాల్లో బుధవారం, రేవోజీపేటలో శనివారం వారసంత నిర్వహణ ఉంటున్నది.
అనేక మంది రైతులు, కూలీలు పనుల నిమిత్తం పొద్దంతా బిజీబిజీగా ఉండడంతో పలు గ్రామాల్లో వారసంతలను రాత్రిపూట నిర్వహిస్తున్నారు. దీంతో వారాలు తెలుసుకొని కడెం, జన్నారం, ఖానాపూర్, దండేపల్లి, ఉట్నూర్ ప్రాంతాల వ్యాపారులు ఆయా గ్రామాలకు వచ్చి, సరుకులు విక్రయిస్తున్నారు. దీని వల్ల గ్రామ పంచాయతీలకు ఆదాయం పెరుగుతున్నది. వారసంతల కారణంగా వీధి దీపాలు, రహదారుల మరమ్మతులు, మంచినీటి సౌకర్యం కల్పించారు. దీంతో ఇటు ప్రజలు, అటు వ్యాపారులకు, వీడీసీ, గ్రామ పంచాయతీలకు మేలు జరుగుతున్నది.
వారసంత నిర్వహణతో పంచాయతీలో సౌకర్యాలు మెరుగుపడ్డాయి. వారసంత నిర్వహణతో అనేకమంది వ్యాపారులకు ఆదాయం, రైతులు, ప్రజలకు అన్ని రకాల వస్తువులు అందుబాటులోకి వచ్చాయి. ప్రతి మంగళవారం గ్రామంలోనే వారసంత ఏర్పాటు చేయడంతో ఇక్కడి ప్రజలంతా గ్రామంలోనే అవసరమైన సరుకులు కొనుకుంటున్నారు.
– ఆకుల లచ్చన్న, గ్రామస్తుడు, లింగాపూర్
కొన్ని జీపీలతో పాటు దస్తురాబాద్ కొత్త మండలం అయ్యాక కడెంతో పాటు, ఆ మండలంలోని గ్రామాల్లో వారసంతలు కొనసాగుతున్నాయి. దీంతో ఆదివారం నుంచి శనివారం వరకు ఒక్కో గ్రామానికి వెళ్లి వ్యాపారం చేస్తుంటాం. కడెంలో ఐదు, దస్తురాబాద్ లో నాలుగు గ్రామాల్లో సంతలు కొనసాగుతున్నాయి. మా వ్యాపారం కూడా మెరుగుపడింది.
– అల్లాడి శ్రీధర్, వ్యాపారస్తుడు, కడెం