దండేపల్లి, మే 29 : దండేపల్లి మండలంలోని గుడిరేవు గోదావరి వద్ద గిరిజనుల ఆరాధ్యదైవం పద్మల్‌పురి కాకో దేవాలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. కాసిపేట మండలం దేవాపూర్ గ్రామానికి చెందిన గిరిజనులు పెద్దసంఖ్యలో తరలివచ్చి జంగుబాయి దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు గిరిజనులు పాదయాత్రగా గోదావరికి బయలుదేరారు.
విగ్రహాలను పవిత్ర గోదావరి జలంతో అభిషేకించారు. గిరిజన సంప్రదాయం ప్రకారం నృత్యాలు చేశారు. లోక కల్యాణం కోసం, సమృద్ధిగా వర్షాలు కురవాలని, అందరూ బాగుండాలని ప్రతి యేటా ఈ పండుగను నిర్వహిస్తున్నట్లు గిరిజనులు తెలిపారు. తిరుగు ప్రయాణంలో కాకో అమ్మవారికి పూజలు నిర్వహించారు. మేకలు, కోళ్లు బలిచ్చి సహపంక్తి భోజనాలు చేశారు. సిడాం అచ్యుత్‌రావు, సిడాం రాందాస్ పాల్గొన్నారు.