దండేపల్లి, మే 29 : కట్న వేధింపులకు ఓ యువ వైద్యురాలు బలి అయ్యింది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని నర్సాపూర్‌కు చెందిన వంగ భారతి (31) స్త్రీ వైద్య నిపుణురాలు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన పిల్లల వైద్య నిపుణుడు కనకట్ట రమేశ్‌తో గతేడాది డిసెంబర్ 9న వివాహం జరిగింది. అప్పుడు ఎకరం పొలం, రూ.5 లక్షల నగదు, 20 తులాల బంగారంతో పాటు ఇతర లాంఛనాలు కట్నంగా ఇచ్చారు. పెళ్లి అనంతరం వీరిద్దరు హైదరాబాద్‌లోని ఎల్బీనగర్లో ఉంటున్నారు. భర్త రమేశ్ అత్తాపూర్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానలో పని చేస్తున్నాడు.
కొద్ది రోజులుగా ఇద్దరం కలిసి దవాఖాన పెడుదామని అదనపు కట్నం కోసం భార్యను తాగి వచ్చి వేధించేవాడు. దీంతో 15 రోజుల క్రితం భారతి నర్సాపూర్‌లోని పుట్టింటికి వచ్చింది. వారం క్రితం పెద్దలు ఇద్దరికి నచ్చజెప్పి కాపురానికి పంపారు. శుక్రవారం రాత్రి భారతికి కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా స్పందించలేదు. శనివారం ఉదయం ఆత్మహత్య చేసుకుందని విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటినా హైదరాబాద్‌కు తరలివెళ్లారు.
భర్త కట్న వేధింపుల కారణంగానే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని తండ్రి శంకరయ్య ఫిర్యాదు అందించినట్లు సమాచారం. ఆదివారం సాయంత్రం భారతి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చి అంత్యక్రియలు పూర్తి చేశారు. ఉన్నత చదువులు చదివి ఉజ్వల భవిష్యత్ ఉన్న యువ వైద్యురాలు మరణించడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.