ఆర్మూర్/ ఏర్గట్ల, మే 28 : నిజామాబా ద్ జిల్లా ఏర్గట్ల మండలం బట్టాపూర్కు చెందిన ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. భర్త, అత్త, మామలే హత్య చేశారంటూ మృతురాలి కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. వివరాలిలా ఉన్నాయి. నిర్మల్ జిల్లా ముక్టాపూర్కు చెందిన సమ్రీన్ (25)కు నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం బట్టాపూర్కు చెందిన అజీమ్తో మూడేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లి సమయంలో రూ. 5 లక్షలు, ఇతర కానుకలు ముట్టజెప్పారు. వీరికి రెండేండ్ల బాబు, ఏడు నెలల పాప ఉన్నారు.
అదనపు కట్నం కింద మరో రూ.5 లక్షలు ఇవ్వాలని వేధించడంతో రూ.2 లక్షలు చెల్లించారు. సమ్రీన్ శుక్రవారం సాయంత్రం బాత్రూంలోకి వెళ్లి ఉరేసుకొని ఆత్మహతకు పాల్పడినట్లు ఏర్గట్ల ఎస్ఐ రాజు తెలుపగా, తన కూతురును కట్నం కోసం వేధించి భర్త, అత్త,మామ హత్యచేశారంటూ సమ్రీన్ తండ్రి షేక్ హైముద్దీన్ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న ఎస్సై.. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆర్మూర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
సమ్రీన్ను హత్యచేసిన భర్త, అత్తమామలపై చర్యలు తీసుకోవాలంటూ కుటుంబీకులు ఆర్మూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని నిజాంసాగర్ కెనాల్ వద్ద శనివారం రాస్తారోకో చేశారు. కట్నం కోసం వేధించి సమ్రీన్ను చంపి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపించారు. ఇరువైపులా వాహనాలు నిలిచిపోవడంతో ఎస్ఐలు శ్రీకాంత్, ప్రమోద్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రాస్తారోకోను విరమించారు.