ఆదిలాబాద్ జిల్లాలోని మూడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను జాతీయ అవార్డులు వరించాయి. దంతన్‌పల్లి, భీంపూర్, ఇచ్చోడ పీహెచ్‌సీల్లో అందుతున్న మెరుగైన సేవలకు కాయకల్ప అవార్డులు, జాతీయ నాణ్యతా హామీ ప్రమాణాల ధ్రువపత్రం (నేషనల్ అస్యూరెన్స్ స్టాండర్స్ సర్టిఫికెట్) లు లభించాయి.
ప్రభుత్వ దవాఖానల్లో అన్ని రకాల పరీక్షలు నిర్వహించడం, రోగాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, కేసీఆర్ కిట్లు ఇవ్వడంతో ప్రసవాల సంఖ్య పెరుగడం, ఐటీడీఏ సమకూర్చిన అంబులెన్స్ ద్వారా గిరిజన గర్భిణులు, బాలింతలకు నిరంతర సేవలందిస్తుండడంతో అవార్డులు లభిస్తున్నాయి. జాతీయ స్థాయి అవార్డులు వరించిన మూడు పీహెచ్‌సీలపై కథనాలు..
– ఉట్నూర్/భీంపూర్/ఇచ్చోడ, మే 28
ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ పీహెచ్సీ మెరుగైన సేవలతో ప్రశంసలు అందుకుంటున్నది. అధునాతన వైద్య సౌకర్యాలకు తోడు సిబ్బంది టీంవర్క్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నది. సేవలకు గుర్తింపుగా కాయకల్ప అవార్డు, నాణ్యతా హామీ ప్రమాణాల ధ్రువపత్రం కోసం కూడా ఎంపికైంది.
ఈ పీహెచ్సీలో వైద్యాధికారి, హెచ్ఏ, ఇద్దరు సూపర్వైజర్లు, ఎంపీహెచ్వో, 2ఎంపీహెచ్‌ఈవోలు, ఎల్ టీ, 5 ఐదుగురు స్టాఫ్ నర్సులు, ఇద్దరు సహాయకు లు, 108,102 సిబ్బంది పనిచేస్తున్నారు. 24 రకాల రక్తపరీక్షల కోసం టీ హబ్ యంత్రం అందుబాటులో ఉన్నది. స్కానర్, కంటి పరీక్షల యంత్రాలున్నాయి. ఎన్సీడీ, యువ క్లినిక్, ఎస్టీడీ నిర్వహిస్తున్నారు. ఇంటింటికీ జ్వర సర్వే, కొవిడ్ పరీక్షలు చేస్తున్నారు. కొవిడ్ టీకాలు వంద శాతం పూర్తి చేశారు. ప్రతి నెలా ఆయా గ్రామాల్లో శిబిరాలు నిర్వహిస్తున్నారు.
ఈ ఔషధి సేవలూ అందుబాటులో ఉన్నాయి. గతంలో ఉన్న వైద్యాధికారి శ్రీకాంత్ సత్ఫలితాలు సాధించారు. ప్రస్తుత అధికారి డాక్టర్ విజయసారథి సారథ్యంలో విజయవంతంగా కొనసాగుతున్నది. క్రమం తప్పకుండా ఏఎన్సీ( ఆల్ట్రా నెట్ క్యాంపు) శిబిరాలను నిర్వహిస్తున్నారు. నిర్ణీత తేదీల్లో ఉప కేంద్రాల వారీగా గర్భిణులకు స్కానింగ్‌తోపాటు వివిధ రకాల పరీక్షలు చేస్తున్నారు.
ప్రైవేట్ దవాఖానలో ‘ప్రసవాలు వద్దు.. ప్రభుత్వ దవాఖానే ముద్దు’ అంటూ అవగాహన కల్పిస్తున్నారు. ఇక్కడ సురక్షిత ప్రసవాలు నిర్వహిస్తూ.. కేసీఆర్ కిట్, నగదు అందిస్తున్నారు. ఇప్పటి వరకు 2 వేల మందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించారు. ఐటీడీఏ సమకూర్చిన అంబులెన్స్ ద్వారా గిరిజన గర్భిణులు, బాలింతలకు నిరంతర సేవలందిస్తున్నారు. 2017లో కాయకల్ప, 2022 సంవత్సరానికి గాను నాణ్యతా హామీ ప్రమాణాల ధ్రువపత్రం కోసం ఎంపికైందని, వైద్యాధికారి విజయసారథి తెలిపారు.
గతంలో సర్కారు వైద్యమంటేనే వెనుకడుగు వేసేవారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అందుకు నిదర్శనమే ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని దంతన్‌పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పీహెచ్సీ). మెరుగైన సేవలతో నిరుపేదల ఆరోగ్యానికి భరోసానిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నది. ఇప్పటికే రెండుసార్లు జాతీయ స్థాయి పురస్కారాలకు ఎంపికైంది.
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని దంతన్‌పల్లి మారుమూల గ్రామం. ప్రభుత్వం ఇక్కడి పీహెచ్సీలో సకల సౌకర్యాలు కల్పించి మెరుగైన వైద్యం అందిస్తున్నది. రోజూ 50 నుంచి 60 మంది ఔట్ పేషెంట్లు వస్తున్నారు. వైద్యులు, సిబ్బంది నిత్యం రోగులకు అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తున్నారు. కేసీఆర్ కిట్ ప్రారంభ నుంచి డెలివరీల సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది. గతంలో నెలకు పదుల సంఖ్యలో ఉండే డెలివరీలు.. ప్రస్తుతం నెలకు దాదాపు 100 వరకు అవుతున్నాయి. విశాలమైన సమావేశ మందిరం, టీవీతోపాటు కూర్చునేందుకు వీలుగా బెంచీలు ఏర్పాటు చేశారు. దవాఖాన ఆవరణలో నాటిన మొక్కలు ఏపుగా పెరిగి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.
దంతన్‌పల్లి పీహెచ్సీ రెండుసార్లు జాతీయ అవార్డుకు ఎంపికైంది. 2018లో నేషనల్ క్వాలిటీ బృందం 500 రకాల సౌకర్యాలపై సర్వే నిర్వహించింది. ఉత్తమ సేవలు అందిస్తున్నందుకు కేంద్రం ఈ పీహెచ్‌సీని జాతీయస్థాయి కాయకల్ప అవార్డుకు ఎంపిక చేసింది. కాగా.. మా దవాఖాన పరిధిలో పది ఉప కేంద్రాలు ఉన్నాయని, సర్కారు దవాఖానలోనే డెలివరీలు సురక్షితమని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వైద్యురాలు కుమ్ర అనుధార తెలిపారు.

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖాన ఉత్తమ సేవలకు కేరాఫ్‌గా నిలుస్తున్నది. దీని పరిధిలో ఆరు ఆరోగ్య ఉప కేంద్రాలు (కోకస్ మన్నూర్, ఇచ్చోడ తూర్పు, ఇచ్చోడ పడమర, గేర్జం, బోరిగామ, తలమద్రి) ఉన్నాయి. ప్రతి రోజూ 100 నుంచి 150 మంది రోగులు ఇక్కడికి వస్తుంటారు. ఇక ప్రతి సోమవారం 50 మంది గర్భిణులకు పరీక్షలు చేస్తారు.
ప్రతి సోమవారంతోపాటు ప్రతి నెలలో వచ్చే మొదటి, రెండో శుక్రవారాల్లో గర్భిణులకు ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తున్నారు. మూత్రం, రక్త పరీక్షలు, షుగర్, యూరిన్ ఆల్బోమిన్, వీడీఆర్ఎల్, ఎయిడ్స్ వంటి పరీక్షలు చేస్తున్నారు. ఆరోగ్య ఉప కేంద్రాల పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు గర్భిణుల ఇంటికి వెళ్లి వారి ఆరోగ్య స్థితిగతులను తెలుసుకుంటూ వైద్య సేవలను అందిస్తున్నారు.

కేసీఆర్ కిట్‌తో ప్రసవాల సంఖ్య పెరుగుతోంది. ప్రతి నెలా 40 నుంచి 45 వరకు సాధారణ ప్రసవాలు జరుగుతున్నాయి. కేసీఆర్ కిట్ అమలు కాకముందు ప్రసవాల కోసం ప్రైవేట్ దవాఖానాలకు వెళ్తూ వేలకు వేలు ఖర్చు పెట్టి ఆర్థికంగా నష్టపోయేవారు. ప్రస్తుతం సర్కారు దవాఖానలో ప్రసవించిన తర్వాత ఆడబిడ్డకు రూ.13 వేలు, మగ బిడ్డకు రూ.12 వేల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం సహాయం అందిస్తున్నది.
దీనికి తోడు అమ్మఒడి వాహనం ద్వారా తల్లీబిడ్డలను ఇంటికి సురక్షితంగా చేరవేస్తున్నది. ఈ పథకం అమలుతో సర్కారు దవాఖానలపై నమ్మకం పెరిగింది. దీంతో 2018, 2022 సంవత్సరాల్లో రెండు సార్లు జాతీయ నాణ్యతా హామీ ప్రమాణాల ధ్రువపత్రం (నేషనల్ అస్యూరెన్స్ స్టాండర్స్ సర్టిఫికెట్) పురస్కారానికి ఎంపికైంది. కాగా.. మా దవాఖానలో నెలకు 40 నుంచి 45 సాధారణ ప్రసవాలు జరుగుతున్నాయని వైద్యాధికారి ఆకుదారి సాగర్ తెలిపారు.
జాతీయ స్థాయి పురస్కారానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఏటా రూ. 3 లక్షల చొప్పున ప్రోత్సాహకం అందిస్తుంది. ఇందులో 25 శాతం నిధులు పీహెచ్సీలో పని చేసే సిబ్బందికి అందజేస్తారు. మిగతా 75 శాతం నిధులను దవాఖాన అభివృద్ధి నిధిలో జమ చేస్తారు. ఈ నిధులతో మౌలిక వసతుల కల్పన, పరికరాలు, అత్యవసర మందుల కొనుగోలుకు వినియోగిస్తారు. దీని ద్వారా మరిన్ని మెరుగైన సేవలను అందించడానికి వీలు అవుతుంది.
