గ్రామాల్లో పెరటికోళ్ల పెంపకానికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. మహిళా సంఘాల ఆధ్వర్యంలో యూనిట్ల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నది. ఇందుకోసం రూ.2.25 కోట్లతో వెయ్యి యూనిట్లు నెలకొల్పేలా చర్యలు ప్రారంభించింది. ఒక్కో యూనిట్‌కు రూ.22,500 నుంచి రూ.3 లక్షల వరకు రుణం అందించనున్నది. యూనిట్లో వంద కోడిపిల్లలను ఇవ్వనున్నది. పెంపకానికి సంబంధించి సహాయ సహకారాలు అందించనున్నది. ప్రస్తుతం మార్కెట్లో కోడి మాంసానికి, పైగా నాటుకోడికి మంచి డిమాండ్ ఉండడంతో మహిళా సంఘాలకు మెరుగైన ఆదాయం సమకూరున్నది.
– కుమ్రం భీం ఆసిఫాబాద్, మే 28(నమస్తే తెలంగాణ)
మహిళా సంఘాలకు మంచి ఆదాయ మార్గాలను అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు అమలు చేస్తున్నది. జిల్లాలో మహిళా సంఘాల ద్వారా ఇప్పటికే మిల్లెట్ పరిశ్రమ (చిరుధాన్యాల పొడుల ప్రాసెసింగ్ యూనిట్), ఆధునిక సాంకేతికతతో సినిమా టాకీస్ ఏర్పాటు చేసి మహిళా సంఘాలకు ప్రభుత్వం మంచి ఆదాయ మార్గాలను చూపించింది. ప్రభుత్వం జిల్లాలోని ఆయా గ్రామాల్లో మహిళల ఆధ్వర్యంలో కోళ్ల పెంపకాన్ని కూడా కుటీర పరిశ్రమగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టింది. దీనికోసం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.2.25 కోట్లతో జిల్లాలో వెయ్యి యూనిట్లను అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.
మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం నూతన ఆదాయ మార్గాలను అమలు చేస్తూ స్వయం సహాయక సంఘాలను ఆర్థిక స్వావలంబన దిశగా తీసుకెళ్తున్నది. దీని ద్వారా మహిళలకు ఆదాయం సమకూరుతూనే ప్రజలకు మంచి పౌష్టికాహారం అందించాలనే సంకల్పంతో పెరటి కోళ్ల పెంపకాన్ని పెద్ద ఎత్తున చేపడుతున్నది. ఇందులో భాగంగా జిల్లాలో రూ.2.25 కోట్లతో వెయ్యి యూనిట్ల అమలుకు చర్యలు చేపట్టింది. ఈ యూనిట్ల ద్వారా మహిళలకు మెరుగైన స్వయం ఉపాధి కలుగడంతో పాటు కోళ్ల పెంపకం ద్వారా గుడ్లు, మాంసంతో పౌష్టికాహారం కూడా అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ యూనిట్లకు ప్రాధాన్యం కల్పిస్తున్నది.
జిల్లాలో వెయ్యి పెరటి కోళ్ల యూనిట్లను మహిళా సంఘాల ద్వారా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం.. ఈ రుణాలను మహిళలకు వ్యక్తిగతంగా అందించనున్నది. స్వయం సహాయక సంఘాల్లో కోళ్ల పెంపకానికి ఆసక్తి చూపించే మహిళలకు ఒక్కొక్క యూనిట్‌కు రూ.22,500 అందిస్తారు.
ఇలా వెయ్యి మందికి రుణాలు ఇస్తారు. ఒక్కొక్క యూనిట్లో 100 కోడి పిల్లలుంటాయి. ఇదే కాకుండా కోడి పిల్లల ఉత్పత్తి (మదర్ యూనిట్స్) చేయాలనుకునే మహిళలకు ప్రత్యేకంగా రూ.3 లక్షల వరకు రుణాలు అందిస్తారు. మదర్ యూనిట్లను ఏర్పాటు చేయాలని ఆసక్తి చూపించే స్వయం సహాయక సంఘాలకు కావాల్సిన శిక్షణ, సహాయ సహకారాలు అందిస్తారు.
మారుతున్న పరిస్థితులను బట్టి ప్రజలు తమ ఆరోగ్యంపై ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా కరోనాతో ఆహారపు అలవాట్లలోనూ మార్పులు చోటు చేసుకున్నాయి. శాకాహారం కంటే మాంసాహారం తినేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. దీనికితోడు కోళ్ల ఉత్పత్తి తగ్గడం, ఇతర కారణాలతో కోడిమాంసం ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. రాబోయే రోజుల్లో మరింత ధరలు పెరిగే అవకాశాలు లేకపోలేదు. ఇక నాటుకోళ్లకు ఎలాంటి డిమాండ్ ఉంటుందో ఊహించుకోవచ్చు.
ఇప్పటికే గ్రామాల్లో నాటు కోళ్ల్లు కనిపించడం లేదు. ఎక్కడైనా నాటు కోళ్లుంటే వాటికి చాలా డిమాండ్ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో గ్రామాల్లో పెంచే నాటుకోళ్లకు మంచి డిమాండ్ ఉంటుందనడంలో సందేహం లేదు. గ్రామాల్లో ప్రభుత్వం రూ.2.25 కోట్లతో వెయ్యి నాటుకోళ్ల యూనిట్లను పెంచేందుకు మహిళా సంఘాల ద్వారా ప్రణాళికలు అమలు చేస్తున్నది. నాటు కోళ్ల పెంపకం ద్వారా మహిళలకు మంచి ఆదాయం సమకూరనున్నది. నాటు కోడి, గుడ్లు విక్రయించడం ద్వారా మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా రుణాలు అందిస్తున్నది.