నిర్మల్ అర్బన్, మే 28 : మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, కుటుంబ సభ్యులపై లేనిపోని ఆరోపణలు చేస్తున్న మహేశ్వర్‌రెడ్డి మాజీ ఎమ్మెల్యేగానే మిగిలిపోతాడని టీఆర్ఎస్ నాయకులు అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, నిర్మల్ ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి మాట్లాడారు. నిర్మల్‌లో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి చేసిన అభివృద్ధిని ఓర్వలేకనే మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాడని మండిపడ్డారు.
కలెక్టరేట్ భవన నిర్మాణంపై మహేశ్వర్ రెడ్డి పూటకో మాట మాట్లాడుతున్నాడని విమర్శించారు. గతంలో కలెక్టరేట్ నిర్మాణ పరిసరాల్లో మంత్రి కుటుంబ సభ్యులు, బంధువులకు స్థలాలు ఉన్నాయని లేనిపోని ఆరోపణలు చేశాడని, అవి నిరూపితం కాలేదన్నారు. మహేశ్వర్ రెడ్డి అనుచరులు, కార్యకర్తలే ప్రభుత్వ భూములను కబ్జా చేసి, అమాయక ప్రజలకు విక్రయిస్తున్నారని ఆరోపించారు. డీ వన్ పట్టాల విషయంతో గతంలో మహేశ్వర్ రెడ్డి టీఆర్ఎస్ నాయకులు, మంత్రి కుటుంబ సభ్యులపై అనేక ఆరోపణలు చేశాడని.. వాటిని రుజువు చేయకుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న మాటను నిలబెట్టుకోవాలన్నారు.
ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నారని మహేశ్వర్ రెడ్డి గతంలో ఇచ్చిన ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా టాస్క్‌ఫోర్స్ అధికారులు విచారణ చేసి గాజులపేట్‌లోని అక్రమ వెంచర్లను తొలగిస్తే అడ్డుకున్నది అతని అనుచరులు కాదా అని ప్రశ్నించారు. ప్రభుత్వ స్థలాలను ఎవరు ఆక్రమించారో ప్రజలకు తెలుసని చెప్పారు. సర్వే నంబర్ 342 /68, 342/67, 342/11 తో పాటు ఇతర సర్వే నంబర్లలోని అసైన్డ్ భూముల్లో ప్లాట్లు చేసి విక్రయిస్తున్నది మహేశ్వర్ రెడ్డి అనుచరులేనని ఆరోపించారు.
సండే ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్న మహేశ్వర్‌రెడ్డిని ప్రజలు నమ్మరని స్పష్టం చేశారు. అభివృద్ధి చేసే నాయకులకే ప్రజలు పట్టం కడుతారని, ఇందుకు నిదర్శనం మచ్చలేని నాయకుడు ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. సమావేశంలో కౌన్సిలర్లు అయ్యన్నగారి రాజేందర్, గండ్రత్ రమణ, నేరేళ్ల వేణు, పూదరి రాజేశ్వర్, లక్కాకుల నరహరి, నాయకులు అడ్ప పోశెట్టి, కొండ శ్రీధర్, నజీర్, టీఎల్ఎన్ చారి, అనిల్ ఉన్నారు.