వేమనపల్లి/ కోటపల్లి / కౌటాల, ఏప్రిల్ 17 : ప్రాణహితలో పుష్కర స్నానాలు ఆచరించేందుకు ఐదో రోజు ఆదివారం భక్తులు పోటెత్తారు. సెలవుదినం కావడంతో పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం 5 గంటల నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఘాట్లకు చేరుకున్నారు. కోటపల్లిలో లక్ష మంది, కౌటాలలో 4 వేల మంది, వేమనపల్లిలో రెండు వేల మంది పుణ్యసాన్నాలు ఆచరించినట్లు దేవాదాయశాఖ అధికారులు తెలిపారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి భక్తులు వచ్చి స్నానాలు ఆచరించారు. జలతర్పణాలు, పిండ ప్రదానాలు నిర్వహించారు. నదిలో దీపాలు వదిలారు. వాయినాలు, చీరె, సారె సమర్పించారు. సైకత లింగాలను ఏర్పాటు చేసి పూజలు చేశారు. హైకోర్టు ఆఫీసర్ జోహార్రెడ్డి ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ప్రాణహితలో పుణ్యస్నానాలు ఆచరించారు. కోటపల్లి మండలంలోని అర్జునగుట్ట ప్రాణహిత పుష్కర ఘాట్‌ను డీసీపీ అఖిల్ మహాజన్ సందర్శించి పుష్కర ఏర్పాట్లను పరిశీలించారు.