లక్షెట్టిపేట రూరల్, మే 27 : నూతన వ్యవసాయ పద్ధతులు అవలంబించి అధిక దిగుబడులు సాధించాలని రైతులకు జగిత్యాల ప్రాంతీయ పరిశోధనా స్థానం పరిశోధన సంచాలకురాలు ఉమాదేవి సూచించారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ప్రాంతీయ పరిశోధనా స్థానం, జగిత్యాల, కృషి విజ్ఞాన కేంద్రం బెల్లంపల్లి, ఆదిలాబాద్ పరిశోధనా కేంద్రం, ముథోల్ ఏరువాక కేంద్రం, కరీంనగర్ జోనల్ స్థాయి పరిశోధనా కమిటీ శాస్త్రవేత్తలతో శుక్రవారం లక్షెట్టిపేట మండలంలోని ఇటిక్యాల గ్రామంలోని రైతు కోడే తిరుమల్ రావు సాగు చేస్తున్న యాసంగి పత్తి పంటక్షేత్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యాసంగిలో వరికి బదులు సాగు చేసిన ఇతర పంటలను పరిశోధించేందుకు జోనల్ స్థాయిలో కమిటీ వేసినట్లు తెలిపారు. ఇందులో భాగంగా జిల్లాల్లో వివిధ పంటలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
విత్తనాలు విత్తినప్పటి నుంచి పంట చేతికి వచ్చే వరకూ తీసుకోవాలని యాజమాన్య చర్యలపై అవగాహన కల్పిస్తామని తెలిపారు. అనంతరం రైతు కోడే తిరుమల్ రావును యాసంగి పంట విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కో ఆర్డినేటర్ రాజేశ్వర్ నాయక్, ముథోల్ ఏరువాక కేంద్రం కో ఆర్డినేటర్ వీరన్న, ఆదిలాబాద్ కో ఆర్డినేటర్ ప్రవీణ్, సీనియర్ శాస్త్రవేత్త తిరులమలరావు,బెల్లంపల్లి కేవీకే శాస్త్రవేత్తలు శివకృష్ణ, నాగరాజు, కరీంనగర్ శాస్త్రవేత్త రాజేంద్రప్రసాద్ మండల వ్యవసాయ అధికారి ప్రభాకర్, విస్తరణ అధికారి ప్రసన్న, రైతులు పాల్గొన్నారు.
చెన్నూర్ రూరల్, మే 27: యాసంగిలో ఇతర పంటల సాగుపై దృష్టిపెట్టాలని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, పొలాస సహ పరిశోధనా స్థానం సంచాలకురాలు ఉమాదేవి సూచించారు. చెన్నూ ర్ మండలంలోని శివలింగాపూర్లో సాగు చేస్తున్న యాసంగి పత్తి సాగును శాస్త్రవేత్తలు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు యాసంగిలో వరికి ప్రత్యామ్నాయంగా పత్తి సాగు చేస్తున్న రైతుల క్షేత్రాలను సందర్శిస్తున్నామని తెలిపారు. యాసంగి పత్తి సాగుపై వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు.
యాసంగి పంటల సాగులో మెళకువలపై అవగాహన కల్పించాలని సూచించారు. కృషి విజ్ఞాన కేంద్రం బెల్లంపల్లి ప్రోగ్రాం కో ఆర్డినేటర్ రాజేశ్వర్ నాయక్, ఏరువాక కేంద్రం, ముథోల్ కో ఆర్డినేటర్ వీరన్న, కృషి విజ్ఞాన కేంద్రం ఆదిలాబాద్ విజ్ఞాన కేంద్రం కో ఆర్డినేటర్ ప్రవీణ్, వ్యవసాయ శాఖ పరిశోధనా కేంద్రం ఆదిలాబాద్ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ తిరుమల రావు, బెల్లంపల్లి శాస్త్రవేత్తలు శివకృష్ణ, నాగరాజు, ఏరువాక కేంద్రం శాస్త్ర వేత్త రాజేంద్ర ప్రసాద్, ఏవో మహేందర్, ఏఈవో రాజశేఖర్, రైతులు కాయిత రాజేశ్, దబ్బెట సుధాకర్, నాయకులు పెద్దింటి రాజన్న తదితరులు పాల్గొన్నారు.
చెన్నూర్ రూరల్, మే 27: వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మండలంలోని ఆస్నాద్లోని రైతు వేదికలో ఏఈవో సాగర్ రైతులతో సమావేశం నిర్వహించారు. పంటల సాగు, ధాన్యం నాణ్యతా ప్రమాణాలు, పచ్చిరొట్ట, భాస్వరాన్ని కరిగించే బ్యాక్టీరియా, చిరుధాన్యాల సాగు, సేంద్రియ ఎరువుల ప్రాముఖ్యత, పీఎం కిసాన్ కోసం ఈ-కేవైసీ వివరించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నస్కూరి శ్రీనివాస్, ఇంగిలి రవి పాల్గొన్నారు.