లక్షెట్టిపేట, 27 : రైతులను ఆదుకునే దిశగా టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్‌రావు అన్నారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో శుక్రవారం మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసిన మినుముల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులను కేంద్ర ప్రభుత్వం నట్టేట ముంచేందుకు ప్రయత్నించిందని, వరి ధాన్యం కొనకుండా చేతులు ఎత్తేసిందన్నారు.
ఎంత నష్టం వచ్చినా భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వమే ముందుకు వచ్చిందని తెలిపారు. గన్నీ బ్యాగులు, లారీలు సమకూర్చి, మిల్లర్లతో ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. రైతులకు మరిన్ని కష్టాలు తెచ్చేందుకే బీజేపీ నాయకులు యత్నిస్తున్నారని చెప్పారు. వరికి ప్రత్నామ్నాయంగా సాగు చేసిన మినుము పంట కొనడానికి కేంద్రం ముందుకు రాకున్నా రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి కలెక్టర్‌తో ప్రపోజల్ పెట్టించి మార్క్‌ఫెడ్‌ను ఒప్పించి మినుముల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయించామని తెలిపారు. మినుములు క్వింటాల్‌కు రూ.6300 ధర ఇచ్చి ఆదుకుంటున్నదని తెలిపారు.
దళారులను నమ్మి ఎవరూ మోసపోవద్దన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఎమ్మెస్ చైర్మన్ తిప్పని లింగన్న, మార్కెట్ కమిటీ చైర్మన్ కేతిరెడ్డి సంధ్యారాణి జగన్‌రెడ్డి, మార్క్‌ఫెడ్ డీఎం గౌరీనాగేశ్వర్, ఏడీఏ అనిత, డీసీవో కృష్ణ, మార్కెట్ కార్యదర్శి శ్రీనివాస్, ఏవో ప్రభాకర్, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు మోటపల్కుల గురువయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చుంచు చిన్నయ్య, పట్టణ అద్యక్షుడు పాదం శ్రీనివాస్, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు నడిమెట్ల రాజన్న, జాగృతి నాయకుడు బాణాల రమేశ్, సహకార సంఘం వైస్ చైర్మన్ కాసు సురేశ్‌తో పాటు నాయకులు కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు.