సీసీసీ నస్పూర్, మే 27: వచ్చే నెల 3 నుంచి చేపట్టనున్న 5వ విడుత పట్టణ ప్రగతిని పకడ్బందీగా నిర్వహించాలని మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులకు సూచించారు. శుక్రవారం సీసీసీ సింగరేణి అతి థి గృహంలోని సమావేశ మందిరంలో మంచిర్యాల జిల్లాలోని 7 మున్సిపాలిటీల పాలకవర్గం సభ్యులు, అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఐదో విడుత పట్టణ ప్రగతి నిర్వహణ, కొత్త మున్సిపల్ చట్టంపై చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆమె పలు అంశాలపై పాలకవర్గం సభ్యులు, అధికారులకు దిశానిర్దేశం చేశారు. కొత్త మున్సిపల్ చట్టంలోని అంశాలను వారికి వివరించారు. అవినీతి రహిత పరిపాలన కోసమే ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకువచ్చిందన్నారు. ప్రజాప్రతినిధులు చట్టానికి లోబడి పనిచేయాలని, లేదంటే అనర్హత వేటు తప్పదని ఆమె హెచ్చరించారు. ఆదర్శ మున్సిపాలిటీలుగా తీర్చిదిద్దడానికి 42ఆంశాలను కొత్త చట్టంలో పొందుపర్చినట్లు తెలిపారు.
అనుమతిలేకుండా ఇళ్లు కడితే కూల్చివేసి ఖర్చులు వారి నుంచే వసూలు చేయాలన్నారు. అధికారులు తప్పిదాలు చేస్తే ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించేది లేదన్నారు. జిల్లాలో ఉన్న 7 మున్సిపాలిటీల్లో 45 శాతం జనాభా ఉందని, పట్టణాల అభివృద్ధి కోసమే ప్రజాప్రతినిధులకు కొత్త చట్టంపై శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. శిక్షణకు ఎక్కువ మంది హాజరుకాకపోవడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. రానివారికి షోకాజ్ నోటీసులు పంపిస్తామని తెలిపారు.
వచ్చే నెల 3 నుంచి ప్రారంభం కానున్న ఐదో విడుత పట్టణ ప్రగతిపై అధికారులు, ప్రజాప్రతినిధులతో కలెక్టర్ సమీక్షించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను చేపట్టిందన్నారు. ఇందులో పల్లె ప్రగతి కార్యక్రమంలో ఆశించినదాని కంటే ఎక్కువ ఫలితాలు వచ్చాయని, పట్టణాల్లో మాత్రం అంతంతమాత్రంగానే అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని ముఖ్యమంత్రి కేసీఆర్ కలెక్టర్ల సమావేశంలో వెల్లడించారని తెలిపారు. ప్రజాప్రతినిధులు నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజలకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించడానికి కృషి చేయాలని సూచించారు.
ఐదో విడుదల పట్టణ ప్రగతిలో భాగంగా తాగునీరు, విద్యుత్, శానిటేషన్, తదితర మౌలిక వసతులపై దృష్టిసారించాలన్నారు. మొక్కలను నాటి సంరక్షించాలని సూచించారు. నాటిన వాటిలో 85 శాతం సంరక్షించకుంటే ప్రజాప్రతినిధులపై వేటు తప్పదని ఆమె హెచ్చరించారు. ప్రజల సంపూర్ణ ఆరోగ్యం కోసం తప్పని సరిగా క్రీడా మైదానాలు ఏర్పాటు చేయాలని సూచించారు. మున్సిపాలిటీల్లో చెత్త సేకరణ సరిగా జరగడంలేదని, తడి, పొడి చెత్తపై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. మున్సిపాలిటీల ఆదాయాన్ని పెంచుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈవో నరేందర్, జిల్లాలోని 7 మున్సిపాలిటీల కమిషనర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.
హాజీపూర్, మే 27 : ఆక్రమిత భూముల క్రమబద్ధీకరణ జీవో నంబర్ 58 సర్వే పనులను వేగవంతం చేయాలని మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని గర్మిళ్ల శివారులో గల హమాలీవాడ ప్రాంతంలోని ఆక్రమిత భూముల్లో నిర్మించిన ఇండ్లను పరిశీలించారు. జీవో నంబర్ 58 అనుసరించి ఇంటి పట్టాలను ఇవ్వాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో అట్టి ఇండ్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జీవో ప్రకారం 2014 సంవత్సరం ముందు ఇండ్లు నిర్మించిన వారికి మాత్రమే పట్టాలను ఇస్తామని తెలిపారు. వేసవి కాలం దృష్ట్యా సర్వే అధికారులు, రెవెన్యూ సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సర్వే పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల తహసీల్దార్ పిన్న రాజేశ్వర్తో పాటు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.