దళితుల దశ తిరిగింది. రెక్కాడితేగాని డొక్కాడని.. రోజంతా పనిచేసినా కనీసం కూలి గిట్టక పూట గడవని జీవితాలకు బతుకుదెరువు దొరికింది. సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన చారిత్రక దళిత బంధు పథకం వెలుగులు నింపింది. నిన్నా మొన్నటిదాకా దినసరి వేతనానికి ఒకరి వద్ద పనిచేసిన కూలీలను యజమానులుగా మార్చింది. ఇందుకు ఆదిలాబాద్ జిల్లాలో పలువురు లబ్ధిదారుల జీవితమే నిదర్శనంగా నిలుస్తున్నది. మొన్నటిదాకా కూలీ పనిచేసి, చాలీచాలని కూలితో కష్టాలు పడ్డ వారిని నేడు ఓనర్లుగా మార్చి, ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది. యూనిట్లు పొందిన ప్రతి కుటుంబం తమ జీవితాలను మార్చిన రాష్ట్ర సర్కారుకు కృతజ్ఞతలు తెలుపుతున్నది.
– ఆదిలాబాద్ టౌన్, మే 27
అణగారిన, అట్టడుగు వర్గాల జీవన ప్రమాణాలు పెంచడానికి తెలంగాణ సర్కారు దళితబంధు ప్రవేశపెట్టింది. ఒక్కో లబ్ధిదారుకు రూ.10 లక్షలు ఇస్తున్నది. ఇప్పటికే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వేల సంఖ్యలో వాహనాలు ఇవ్వగా ఉపాధి పొందుతున్నారు. తాజాగా ఆదిలాబాద్ రూరల్ మండలంలో 60 కుటుంబాలకు దళితబంధు యూనిట్లు మంజూరు చేశారు. లబ్ధిదారులకు కలెక్టర్ పత్రాలు పంపిణీ చేశారు. దళితుల ఆనందం వారిమాటల్లోనే..
– ఆదిలాబాద్ టౌన్, మే 27
నా పేరు కాంబ్లె నితిన్. మాది ఆదిలాబాద్ మండలంలోని చిచ్‌ధరి. నేను డిగ్రీ పూర్తి చేశా. మాకు కొంత వ్యవసాయం ఉంది. దుక్కులు, కలుపు తీయడానికి ట్రాక్టర్‌ను వాడేది. కిరాయి బాగా అయ్యేది. ఇప్పుడు దళితబంధు కింద సర్కారు నాకు ట్రాక్టర్ ఇచ్చింది. నా ఎవుసం పనులు చేసుకుంటూ.. ఇతరుల పనులకు కూడా పోత. దీనితో మా చిల్లర ఖర్చులకు డబ్బులు ఎళ్తాయి. నాకు ట్రాక్టర్ ఇవ్వగా నా పేరిట ఒక లక్ష రూపాయలు ఖాతాలో ఉన్నాయి. ఈ డబ్బులను ట్రాక్టర్ మరమ్మతులకు వినియోగిస్తా. సీఎం కేసీఆర్ సారు మాకు ట్రాక్టర్ ఇచ్చి ఆర్థిక భరోసా ఇచ్చారు. ఎప్పటికీ ఆయనకు కృతజ్ఞతగా ఉంటా.
నా పేరు పూజ. మాది ఆదిలాబాద్ మండలంలోని చిచ్‌ధరి. నేను పదో తరగతి చదివా. నా భర్త వ్యవసాయ కూలీగా పని చేస్తడు. నాకు కూడా ఏదో ఒక పని చేయాలని ఉంది. పెట్టుబడికి డబ్బులు లేవు. ప్రధానంగా లేడీస్ ఎంపోరియం పెట్టాలనే ఆలోచన ఉంది. ఈ క్రమంలోనే దళితబంధు కింద సర్కారు రూ.10 లక్షలు మంజూరు చేసింది. మొన్న కలెక్టర్ మేడం వచ్చి పత్రాలు కూడా ఇచ్చారు. మా ఊరి దగ్గరలోనే ఇంద్రవెల్లి మార్కెట్ ఉంటుంది. అక్కడ వారం రోజుల్లో దుకాణం ప్రారంభిస్తా. సొంతంగా దుకాణం పెట్టుకోవడం ఆనందంగా ఉంది. కలలో కూడా అనుకోలేదు. ఇది సీఎం కేసీఆర్ ఆలోచనతోనే సాధ్యమైంది.
నా పేరు ముకుంద కాలీరామ్. మాది ఆదిలాబాద్ మండలంలోని చిచ్‌ధరి. మాకు కొంత ఎవుసం ఉండగా.. గొర్రెలు, మేకలు మేపుకొని బతుకుతం. ఇవీ తప్పా మాకు ఏ ఉపాధి లేదు. సీఎం కేసీఆర్ సారూ దళితబంధు కింద డబ్బులు ఇస్తున్నారని తెలిసింది. తెలిసిన వాళ్ల ద్వారా దరఖాస్తు చేసుకున్నం. రూ.10 లక్షలు మంజూరయ్యాయి. ఈ డబ్బులు మా ఖాతాలోనే ఉన్నయ్. అధికారులను అడిగితే మీరు జీవాలను కొనుక్కొండని చెప్పారు. దీనికితోడు నీడ కోసం షెడ్డు కూడా వేస్తా. జీవాలకు ఎప్పుడు మార్కెట్ ఉంటది కాబట్టి డబ్బులకు ఢోకా ఉండదు. సాలుకు లక్ష రూపాయల లాభం వచ్చే అవకాశం ఉంది.జీవాల ఎరువులు కూడా అమ్మితే డబ్బులు వస్తాయి.
నేను డెయిరీ పారంలో కూలీగా పనిచేసేటోన్ని. నెలకు 8వేల రూపాయలు వచ్చేవి. గీ పైసలతోనే పిల్లలను చదివించడం, ఇంటి ఖర్సులు ఎల్లదీసుకునేది. ఒక్కోసారి సానా కట్టమయ్యేది. ఇల్లు గడువక పస్తులున్న రోజులు గూడా ఉన్నయ్. గిప్పుడు కేసీఆర్ సారూ రూ.10 లక్షలు ఇత్తండు. గీ పైసలతో డెయిరీ పారం పెట్టుకుంట. నేనే ఓనర్‌ను అవుతా. సొంతంగా నడిపించుకుంట. కట్టపడితే ఎంతలేదన్న నెలకు రూ.20వేలు వచ్చే అవకాశం ఉంది. నా ఆదాయం రెట్టింపు అవుతది. గిప్పుడు మా పిల్లలను మంచిగ చదివించుకుంట. సీఎం సార్‌కు వందనాలు.
– మద్దెల మధూకర్-భావన, కొత్తగూడెం, ఆదిలాబాద్ మండలం
నా పేరు సర్కాలే రాహుల్. నా భార్య పేరు మనీషా. మాది ఆదిలాబాద్ రూరల్ మండలంలోని చిచ్‌ధరి. మాది నిరుపేద దళిత కుటుంబం. చేసుకుంటేనే బతికేది. లేకపోతే పస్తులు ఉండుడే. సీఎం కేసీఆర్ సారూ మా అసొంటి దళితబిడ్డలకు పది లక్షలు ఇస్తరని ప్రకటించారు. నాకు ఆటో అందజేశారు. మొన్న కలెక్టరమ్మ పత్రాలు కూడా ఇచ్చింది. ఇగ, ఆదిలాబాద్ పట్టణానికి మా ఊరికి 40 కిలోమీటర్లు ఉంటది. అక్కడి నుంచి ఇక్కడికి.. ఇక్కడి నుంచి అక్కడికి ఆటో నడుపుకుంటా. నాలుగు డబ్బులు వస్తాయి. నా భార్య పిల్లలను మంచిగ సాదుకుంటా.

మా పేర్లు గైక్వాడ్ సునీత-మాధవ్. మాది ఆదిలాబాద్ రూరల్ మండలంలోని లోహారా గ్రామం. మేము కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తాము. తెలంగాణ సర్కారు దళితబంధు కింద ట్రాక్టర్ అందజేసింది. మా భూమిల పని చేసుకుంటూ.. ఇతరుల పనికి ఉపయోగిస్తా. దుక్కులు, పొలం దున్నడం, వడ్లు సరఫరా చేయడం వంటివాటితో డబ్బులు వస్తాయి. మా పిల్లలను మంచిగా చదివించు కుంటా. గిటువంటి సర్కారును నా జన్మల చూడలేదు. ఒక్కసారి పది లక్షలు ఇవ్వడంతో నమ్మలేక పోతున్నా. నా జన్మాంతం సీఎం కేసీఆర్ సారుకు రుణపడి ఉంటా.

నా పేరు టిగోటె యువరాజ్. మాది ఆదిలాబాద్ మండలంలోని చిచ్‌ధరి. నేను పదో తరగతి చదివా. మామూలు డ్రైవర్‌గా పనిచేస్తా. మాకు మూడెకరాల భూమి కూడా ఉంది. ఏం పని దొరుకక పోవడంతో ఇంటి వద్దనే ఉండి మా తల్లిదండ్రులతో ఎవుసం పని చేసుకుంటున్నా. అప్పుడప్పుడు డ్రైవర్‌గా కూడా పోత. ఈ క్రమంలోనే దళితబంధు కింద వాహనాలు ఇస్తున్నారని తెలిసింది. దరఖాస్తు చేసుకున్నా. నాకు టాటా ఏస్ మంజూరైంది. డ్రైవర్‌గా చేసిన అనుభవం ఉండడంతో మా ఊరి నుంచి ఆదిలాబాద్‌కు ప్రయాణికులను తరలిస్తా. ఇంకా.. ఎరువులు, విత్తనాలను కూడా వాహనంలో సరఫరా చేసి ఉపాధి పొందుతా. గిప్పుడు చేతినిండా పని ఉంది.
మాకు సదువు రాదు. వేరే వాళ్ల దగ్గర పనిచేస్తం. యేడాదికి రూ.90 వేలు ఇచ్చేవారు. ఈ పైసలు బతుకడానికి కూడా సరిపోయేవి కావు. సానా ఇబ్బంది పడేవాళ్లం. గిట్లనే కాలం ఎల్లదీసుకస్తన్నం. మా పంచాయతీ సార్లు నీకు సీఎం దళితబంధు కింద రూ.10 లక్షలు ఇస్తున్నడని చెప్పారు. వీటితో గొర్రెల యూనిట్ తీసుకో అన్నారు. ఒక షెడ్డు కూడా వేసుకోవాలని చెప్పిన్రు. పది లచ్చలు వస్తున్నయనంగనే సంతోషపడ్డ. గన్ని పైసలు నా జీవితంల చూడలేదు. జీవాలను మేపుకుంటూ బతుకుత.
– పల్ల జ్యోతి-గంగాధర్, కొత్తగూడెం, ఆదిలాబాద్ మండలం
మాది వ్యవసాయ కూలీ కుటుం బం. రోజు కూలీ పనికిపోతం. అట్లయితేనే మా ఇల్లు గడుస్తది. గిప్పుడు సీఎం కేసీఆర్ సారు దళితబంధు కింద పది లచ్చల ట్రాలీ ఇచ్చారు. మా కొడుకుకు కొంచెం ట్రాక్టర్ నడుప స్తది. గిప్పుడు సర్కారిచ్చే ట్రాలీతో రోజంతా ఉపాధి పొందుతం. దినమంతా మా ఊరి నుంచి పక్క ఊళ్లకు సామాను తరలిస్తం. ప్రతి యాసంగి, వానకాలం సీజన్లలో ధాన్యాన్ని తరలిస్తే డబ్బులు వస్తా యి. దాదాపు నెలకు రూ.15వేలు వచ్చే అవకాశం ఉంది. సీఎం కేసీఆర్ సారుకు వందనాలు.
– కాంబ్రే లలిత-దత్తు, కొత్తగూడెం, ఆదిలాబాద్ మండలం

మాకు ఎవుసం భూమి లేదు. కూలీ పనిచేస్తేనే ఇల్లు గడిచేది. దినమంత పనిచేస్తే నెలకు అందరికి కలిసి రూ.6 వేలు వచ్చేవి. గిప్పుడు తెలంగాణ సర్కారు దళితబంధు కింద మాకు పది లచ్చల ట్రాక్టర్ ఇచ్చింది. ఇగ ట్రాక్టర్‌కు ఓనర్లం. మా ఇంటి ముందర ట్రాక్టర్ ఉంటే ఎంతో హుందాగా ఉంది. ట్రాక్టర్‌తో ఎవుసం పనులు చేస్తే నెలకు దాదాపుగా రూ.30 వేలు వచ్చే అవకాశం ఉంది. మా ఆదాయం ఐదింతలు రెట్టింపైతది. మా కొడుకులు, బిడ్డలను మంచిగ చదివించుకుంటం. సీఎం కేసీఆర్ సారు మేలు మరిచిపోలేం.
– కాంబ్రే కల్పన-అవినాశ్, కొత్తగూడెం, ఆదిలాబాద్ మండలం
