ఇంద్రవెల్లి, మే 27 : పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా.. సజావుగా నిర్వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ ఆదేశించారు. మండలంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఏ, బీ పరీక్షా కేంద్రాలను శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. పరీక్షల విధానాన్ని పరిశీలించారు. విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలపై ఆరాతీశారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆయన వెంట ఎంపీడీవో పుష్పలత, ఎంపీవో సంతోష్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గోపాల్సింగ్తీలావత్, ఇన్విజిలేటర్లు, తదితరులు ఉన్నారు.
మన ఊరు-మన బడిలో కార్యక్రమంలో భాగంగా ఎంపిక చేసిన మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ పరిశీలించారు. విద్యార్థులకు కల్పించే మౌలిక సౌకర్యాలపై అధికారులతో చర్చించారు. ప్రస్తుతం జిల్లా పరిషత్ పాఠశాలలో 1450 మంది విద్యార్థులు చదువుకుంటున్నారని, అందరికీ అన్ని సౌకర్యాలు కల్పించాలని, అదనపు తరగతి గదులు, మౌలిక వసతులు కల్పించాలని ప్రధానోపాధ్యాయుడు గోపాల్సింగ్తీలావత్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన అన్ని మౌలిక సౌకర్యాలు కల్పించేందకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట ఎంపీడీవో పుష్పలత, ఎంపీవో సంతోష్ ఉన్నారు.