పేదల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ సేవలను మరింత చేరువ చేస్తున్నది. కార్పొరేట్ వైద్యశాలలు, జిల్లా దవాఖానలు, ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఉండే ఈ సేవలను ఇకపై ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ అమలు చేయనుంది. ఇప్పటికే అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుండగా, వైద్య సిబ్బందికి ఇందుకు సంబంధించిన శిక్షణను పూర్తి చేసింది. పెద్ద పెద్ద దవాఖానలకే పెద్ద పెద్ద దవాఖానలకే పరిమితమైన ఈ సేవలు ఇప్పుడు తమకు గ్రామస్థాయిలోనే అందుబాటులోకి వస్తుండడంతో ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తున్నది.
ఆదిలాబాద్, మే 27 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి రాష్ట్రంలో సర్కారు దవాఖానకు వెళ్లాంటే ప్రజలు భయపడేవారు. పేదలకు ఆరోగ్యపరమైన సమస్యలు వస్తే ప్రైవేటు వైద్యశాలలకు వెళ్లి వేలాది రూపాయలు ఖర్చు చేసేవారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం పేదల వైద్యానికి పెద్దపీట వేస్తున్నది. జిల్లా దవాఖానలు మొదలుకుని గ్రామాల్లోని సబ్సెంటర్లలో ప్రజలకు వైద్యసేవలు అందిస్తున్నది. ఫలితంగా ప్రభుత్వాసుపత్రులకు వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది.
మారుమూల గ్రామాల్లోని పీహెచ్సీల్లో సైతం నెలకు 20 నుంచి 30 ప్రసవాలు జరుగుతున్నాయి. కరోనా లాంటి వ్యాధికి సైతం ప్రభుత్వం గ్రామాల్లో వైద్యసేవలు అందిస్తున్నది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పేదలకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నందుకు గాను పలు పీహెచ్సీలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఆరోగ్యశ్రీ ద్వారా సైతం పేదలకు వైద్యం అందుతుండగా వారు పట్టణాలకు వెళ్లాల్సి వస్తుంది. దీంతో వారిపై ఆర్థికభారం పడడంతో పాటు కొన్ని రోజుల పాటు పట్టణాల్లో ఉండాల్సి వస్తున్నది. ఆరోగ్యశ్రీ సేవలను పేదలకు మరింత అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా రాష్ట్రస్థాయిలో వైద్యులకు శిక్షణ ఇచ్చింది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలను త్వరలో ప్రారంభించడానికి వైద్యశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్లో శిక్షణ తీసుకున్న వైద్యులు జిల్లాల్లో వైద్యాధికారులు, సిబ్బంది, డాటా ఎంట్రీ ఆపరేటర్లకు ఆరోగ్యశ్రీ సేవలపై ట్రైనింగ్ ఇస్తున్నారు. దవాఖానలకు వచ్చే వారికి ఎలాంటి పత్రాలు అవసరం, వాటిని ఆన్లైన్లో ఎలా నమోదు చేయాలి, తదితర అంశాలను వివరిస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆరోగ్య శ్రీ సేవలకు అవసరమయ్యే సౌకర్యాలు ఉన్నాయి. వైద్యులు, సిబ్బంది, మందులు పుష్కలంగా ఉన్నాయి. ఈ సేవలు పీహెచ్సీల్లోకి అందుబాటులో రావడంతో సిబ్బందికి ప్రోత్సాహక బహుమతులు లభించడంతో పాటు దవాఖానలకు అభివృద్ధి నిధులు వస్తాయి. ఆరోగ్య శ్రీ సేవలు స్థానికంగా అందుబాటులోకి రావడంపై జిల్లా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.