ఆసిఫాబాద్,మే 26 : అంగన్వాడీ కేంద్రాల్లోని పిల్లల ఎదుగుదలకు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ రాహుల్రాజ్ సూచించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సంబంధిత శాఖల అధికారులతో ‘పోషణ్ అభియాన్’ పై అదనపు కలెక్టర్ వరుణ్రెడ్డితో కలిసి గురువారం సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పిల్లల ఎదుగుదల కోసం క్లస్టర్ల వారీగా నివేదికలు తయారు చేయాలన్నారు.
జైనూర్, కౌటాల, కాగజ్నగర్ క్లస్టర్లలో ఎదుగుదల సూచికలు తక్కువగా ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లోని రైతులు కూరగాయలు పండించేలా అవగాహన కల్పించాలని ఉద్యానవన శాఖ అధికారులను ఆదేశించారు. ‘పోషణ్ అభియాన్’ కేంద్రాల్లో చిరుధాన్యాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి నెలా సఖీ సెంటర్ నిర్వాహకులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్డీవో సురేందర్, డీసీపీవో మహేశ్ పాల్గొన్నారు.
వాంకిడి, మే 26 : జీవో నంబర్ 58,59 క్రమబద్ధీకరణలో భాగంగా మండల కేంద్రంలోని లక్ష్మీనగర్, ఖమానా గ్రామం లోని ప్రభుత్వ స్థలాలను కలెక్టర్ రాహుల్ రాజ్ గురువారం పరిశీలించారు. జూన్ 2 2014 సంవత్సరం నుంచి ప్రభుత్వ స్థలాల్లో నివాసముంటున్న వారికి గ్రామ పంచాయతీ ఇంటి పన్ను, విద్యుత్ మీటర్ రసీదులు ఉంటే అర్హులుగా గుర్తించి హక్కు పత్రాలను అందిస్తామన్నారు. అలాగే ప్రతి గ్రా మంలో క్రీడామైదానాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. డీఎల్పీవో రమేశ్, తహసీల్దార్ మధుకర్, ఎం పీవో శివకుమార్, వాంకిడి కార్యదర్శి విలాస్, ఖమాన కార్యదర్శి పోచయ్య , అధికారులు ఉన్నారు.