శ్రీరాంపూర్, మే 26 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న సింగరేణికి సీఎం, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల అండ ఉందని, ప్రతి సమస్యా ప్రభుత్వంతో ముడి ఉందని, వాటి పరిష్కారానికి టీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్‌తోనే సాధ్యమవుతుందని అధ్యక్షుడు బీ వెంకట్రావ్ స్పష్టం చేశారు. ఎస్ఆర్పీ 1గనిపై ఉపాధ్యక్షుడు కే సురేందర్‌రెడ్డి అధ్యక్షతన గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణి కార్మికుల వారసత్వ ఉద్యోగాలు ఎర్రజెండా యూనియన్ ఏఐటీయూసీ కొల్లగొట్టిందన్నారు.
సీఎం కేసీఆర్ సింగరేణిలో కొనసాగించాలని ఆదేశాలిస్తే ఏఐటీయూసీ కార్యకర్త కోర్టుకెళ్లి అడ్డుకున్నారని ఆరోపించారు. కార్మికుల వద్ద కోట్ల రూపాయల చందాలు వసూలు చేసి కార్మికులకు అన్యాయం చేశారని మండిపడ్డారు. అయినా తమ యూనియన్ ప్రభుత్వ అండతో సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాడినా ఫలితం లేకపోయిందని, దీంతో తిరిగి న్యాయ నిపుణులతో సీఎం కేసీఆర్ చర్చించి చట్టపరిధిలో కారుణ్యం పద్ధతిలో మెడికల్ ఇన్వ్యాలిడేషన్తో ఉద్యోగాలు కల్పించడానికి అవకాశం కల్పించారని తెలిపారు
. మూడేండ్ల నుంచి ఇప్పటి వరకు 10 వేల మంది కార్మికుల పిల్లలకు కారుణ్య ఉద్యోగాలు, నోటీఫికేషన్ల ద్వారా మరో ఆరు వేల ఉద్యోగాలు కల్పించినట్లు వివరించారు. దీంతో ఎర్ర జెండా నాయకులకు ఏడుపు మాత్రమే మిగిలిందని ఎద్దేవా చేశారు. వారి ఉనికి కోల్పోతుండడంతో నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. భవిష్యత్‌లో కారుణ్య ఉద్యోగాలు కొనసాగాలంటే టీబీజీకేఎస్‌ను గెలిపిస్తే తాము బాధ్యత తీసుకుంటామన్నారు.
వేరే యూనియన్ను గెలిపిస్తే గేటుకాడ ఉండి అరవడం, మొరగడం తప్పా చేసేదేమీ లేదని పేర్కొన్నారు. వారి మాటలు నమ్మి కార్మికులు మోసపోవద్దని కోరారు. సింగరేణి బొగ్గు గనులు ప్రైవేటీకరణ చేయకుండా అడ్డుకునే సత్తా టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌కే ఉందన్నారు. కాంట్రాక్టీకరణ, ప్రైవేటీకరణ మొదలు పెట్టింది కాంగ్రేస్, బీజేపీ ప్రభుత్వాల సమయంలో ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీలేనని చెప్పారు.
ఎస్ఆర్పీ 1గనిలో పిట్ కార్యదర్శి ఎంబడి తిరుపతి ఆధ్వర్యంలో 50 మంది కారుణ్య బదిలీ వర్కర్లు టీబీజీకేఎస్‌లో చేర గా.. అధ్యక్షుడు వెంకట్రావ్ కండువాలు కప్పి స్వాగతం పలికారు. టీబీజీకేఎస్ తమకు కారుణ్య ఉద్యోగాలు ఇప్పించింది కాబట్టే సీఎం కేసీఆర్ రుణ తీర్చుకోవడానికి ఇందులో చేరుతున్నామని కారుణ్య బదిలీ వర్కర్లు స్పష్టం చేశారు. నస్పూర్ చైర్మ న్ ఇసంపెల్లి ప్రభాకర్, టీబీజీకేఎస్ కేంద్ర ఉపాధ్యక్షుడు అన్న య్య, మల్లారెడ్డి, కేంద్ర చర్చల ప్రతినిధి ఏనుగు రవీందర్‌రెడ్డి, ఏరియా చర్చల ప్రతినిధి పెట్టం లక్షణ్, వెంగళ కుమారస్వా మి, నాయకులు పెండ్లి రవీందర్, భాస్కర్, జక్కుల రాజేశం, గంగయ్య, సతీశ్, ఎర్రయ్య, రావుల అనిల్ పాల్గొన్నారు.