సింగరేణి స్థలాల్లో నివాసముంటున్న వారి కల నెరవేర్చామని, ఇక పక్కా ఇండ్లు కట్టుకొని సంతోషంగా ఉండమని ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. రామకృష్ణాపూర్‌లోని వార్డుల్లో కార్మిక, కార్మికేతర కుటుంబాలకు పట్టాల పంపిణీ కార్యక్రమం రెండోరోజు గురువారం పండుగలా నిర్వహించారు. గతంలో ఏ నాయకుడూ ఈ పట్టాల పంపిణీ ఆలోచన చేయలేదని, సీఎం కేసీఆర్ సహకారంతో నేడు ఈ స్థలాలకు మిమ్మల్ని యజమానులుగా మార్చామని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో పట్టణ రూపురేఖలు మార్చుకునేందుకు అందరం కలిసికట్టుగా ముందుకెళ్దామని పిలుపునిచ్చారు.
రామకృష్ణాపూర్, మే 26 : క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామకృష్ణాపూర్ పట్టణ వాసుల 30 ఏండ్ల కలను తెలంగాణ ప్రభుత్వం నెరవేర్చిందని చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్, ప్రభుత్వ విప్, టీఆర్ఎస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ పేర్కొన్నారు. రెండో రోజైన గురువారం పట్టణంలో ఏర్పాటు చేసిన ఆరు సభల్లో ఆయన పాల్గొని లబ్ధిదారులందరికీ స్వయంగా ఇండ్ల పట్టాలను పంపిణీ చేశారు. పట్టణంలోని శివాజీనగర్‌లో 11, 12 వార్డుల లబ్ధిదారులు, రామాలయం హనుమాన్ టెంపుల్ వద్ద 1,2,13 వార్డుల లబ్ధిదారులు, పోచమ్మ బస్తీలోని పోచమ్మ దేవాలయం వద్ద 14,15 వార్డులు, బీ జోన్ సెంటర్ గణేశ్ మండపం వద్ద 3,4,17,18 వార్డులు, శ్రీనివాస్‌నగర్ 19, 20 వార్డుల లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలు స్వయంగా అందజేశారు. రామకృష్ణాపూర్ పట్టణ వాసుల 30 ఏండ్ల కలను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చిందని పేర్కొన్నారు.
మహిళలే మహారాణులని, అందుకోసమే ఇండ్ల పట్టాలను మహిళల పేరిటే అందిస్తున్నామని చెప్పారు. ఇండ్ల పట్టాలతో దూర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన అవసరం ఉండదని, బ్యాంక్ లోన్ తీసుకొని ఉన్న ఊళ్లోనే పక్కాగా సొంత ఇల్లు నిర్మించుకోవచ్చన్నారు. ఇది రామకృష్ణాపూర్ పునర్జీవంగా పేర్కొన్నారు. ఇక ముందు రామకృష్ణాపూర్ రూపురేఖలు మారి నవీన పట్టణంగా రూపుదిద్దుకుంటుందని చెప్పారు. గడిచిన 30 ఏండ్లలో ఏ ఒక్క నాయకుడికీ ఇండ్ల పట్టాలు పంపిణీ చేయాలన్న ఆలోచన లేకపోవడం దురదృష్టకరమన్నారు. పట్టణ ప్రజలను ఓటు బ్యాంకుగా చూశారే తప్ప వారిని ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదని వాపోయారు.
ఒకవైపు సింగరేణి గనులు మూతపడుతున్నా, ఊరు బొందల గడ్డగా మారుతున్నా చోద్యం చూస్తూ ఉన్నారే తప్ప ఇండ్ల పట్టాలు ఇచ్చి పట్టణాన్ని కాపాడుకుందామన్న ప్రయత్నాలు చేయలేదని మండిపడ్డారు. నేడు దరఖాస్తు చేసుకున్న 3,940 గృహాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టాలు అందిస్తున్నదని తెలిపారు. ఇండ్ల పట్టాలు రాని వారు ఎవరూ చెప్పుడు మాటలు విని అపోహ పడవద్దని, రానున్న ఒకటి, రెండు నెలల్లో ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేసి అందరికీ అందిస్తామని తెలిపారు. సుమారు రూ.150 కోట్లతో క్యాతనపల్లి మున్సిపాలిటీని సుందరంగా తీర్చిదిద్దే పనులు సాగుతున్నాయని పేర్కొన్నారు.
పని చేసే ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించాలని, ఎన్నికలు ఏవైనా కేసీఆర్ వెంటే నిలవాలని కోరారు. చైర్పర్సన్ జంగం కళ, వైస్ చైర్మన్ విద్యాసాగర్‌రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్, కమిషనర్ జీ వెంకటనారాయణ, కౌన్సిలర్లు గడ్డం సంపత్‌కుమార్, బొద్దుల రమ్యాప్రేమ్సాగర్, గడ్డం విజయలక్ష్మీ రాజు, బింగి శివాణీ శివకిరణ్, పుల్లూరి సుధాకర్, జాడి శ్రీనివాస్, కొక్కుల స్రవంతీ సతీశ్, రేవెల్లి ఓదెలు, రామిడి ఉమాదేవీ కుమార్, ఎల్లబెల్లి గంటాలమ్మ మూర్తి, పార్వతి విజయ, సీనియర్ నాయకులు గాండ్ల సమ్మయ్య, అబ్దుల్ అజీజ్, యాకూబ్అలీ, ఆసాల రాజన్న, ఎర్రబెల్లి రాజేశ్ పాల్గొన్నారు.