నేరడిగొండ, మే 26 :గ్రామీణ ప్రాంతాల్లోని యువతీయువకులను క్రీడల్లో ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రతి పంచాయతీకో క్రీడా ప్రాం గణం ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నది. ఉపాధి హామీ నిధులతో తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణం (టీకేపీ) పేరిట వీటిని నిర్మించనున్నది. ఇప్పటికే గ్రామాల్లో ఖాళీ స్థలాల ఎంపిక ప్రక్రియ ను తహసీల్దార్, ఎంపీడీవోలు, ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బంది మొదలు పెట్టారు. వచ్చే నెల రెండో తేదీలోగా స్థలాల ఎంపిక ప్రక్రియ పూర్తిచేసి ప్రాంగ ణం పనులపై దృష్టి సారించాలని ఇప్పటికే కలెక్టర్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
తెలంగాణ క్రీడా ప్రాంగణాన్ని ఎకరం స్థలంలో నిర్మించనున్నారు. అందులో ఖో-ఖో, కబడ్డీ, వాలీబాల్, లాంగ్‌జంప్‌లో మెళకువలు నేర్చుకునేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. వ్యాయామ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు. ముందుగా స్థలాన్ని చదును చేసిన తర్వాత క్రీడలకు సంబంధించిన కొలతల మేరకు మైదానాన్ని తీర్చిదిద్దనున్నారు. ఇక ప్రాంగణం చుట్టూ ఆహ్లాదంగా ఉండే విధంగా వేప, గుల్మొహర్, సిస్సూ, బాదం, కానుగ, తంగేడు, చింత తదితర మొక్కలు నాటనున్నారు. ప్రాంగణం మధ్యలో వాటర్‌ఫాల్స్, ఫౌంటేన్ ఏర్పాటు చేయనున్నారు.
నేరడిగొండ మండలంలో 32 పంచాయతీలకు గాను అన్ని పంచాయతీల్లో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయనున్నారు. జూన్ 2న కనీసం 2 గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలను ప్రారంభించే దిశగా కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే రెవెన్యూ అధికారులు, ఎంపీడీవోలకు గ్రామాల వారీగా క్రీడా స్థలాలకు సంబంధించిన నివేదిక అందజేశారు. మండలంలోని కుమారి, వడూర్ పంచాయతీల్లో స్థలాలను అధికారులు పరిశీలించారు. ఆయా పంచాయతీల పరిధిలోని ప్రభుత్వ భూములను పరిశీలించారు.
జూన్ 2న మండలంలోని రెండు గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలను ప్రారంభించేందుకు సిద్ధం చేస్తున్నాం. కుమారి, వడూర్ గ్రామాల్లో ప్రభు త్వ స్థలాలను రెవెన్యూ అధికారులతో కలసి పరిశీలించాం. ప్రతి గ్రామానికి ఎకరం భూమిలో క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వం క్రీడల కిట్లు, టీ షర్టులు అందజేస్తుంది.
అబ్దుల్ సమద్, ఎంపీడీవో, నేరడిగొండ
మండలంలో గ్రామీణ క్రీడా ప్రాంగణాలకు స్థలాల గుర్తింపు ప్రక్రియ మొదలైంది. గ్రామాల్లో ప్రభుత్వ భూములను పరిశీలిస్తున్నాం. మైదానాలకు అనువుగా ఉండే స్థలాలపై దృష్టి సారించాం. గ్రామస్తులు కూడా సహకరించాలి.
గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించేందుకు గ్రామానికో క్రీడా ప్రాంగణం సిద్ధం చేయాలని రాష్ట్ర సర్కారు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కసరత్తు ప్రారంభించిన అధికార యంత్రాంగం, స్థలాల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసింది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాల సందర్భంగా ప్రతి మండలంలో రెండు గ్రామాల్లో ఈ మైదానాలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది.