బోథ్, మే 26 : ఉపాధి హామీ పనులు పక్కాగా నడుస్తున్నాయి. ఎన్ఎంఎంఎస్ (నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టం) విధానంలో కూలీల హాజరు నమోదు చేస్తున్నారు. ఫొ టోక్యాప్చరింగ్ విధానంలో కూలీలు పనిచేస్తున్న ఫొటోలు తీసి మేట్లు ఆన్లైన్లో హాజరు వివరాలు పంపుతున్నారు. ఎలాం టి అవకతవకలకు తావులేకుండా పనులు చేయిస్తున్నారు.
ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సుమారు 1,20,480 మంది జాబ్‌కార్డులు కలిగి ఉన్నారు. వ్యవసాయ పనులు లేకపోవడంతో కూలీలు పనులకు వెళ్తున్నారు. ప్రస్తుతం 65 వేల మంది కూలీలు పనులకు హాజరవుతున్నారు. మట్టి కట్టలు, నీటి మళ్లింపు కాలువలు, చెరువుల్లో పూడికతీత, కెనాల్లో పూడికతీత, సీసీటీ తదితర పనులు చేపడుతున్నారు. గ్రామాల వారీగా నియమితులైన మేట్లు పని జరుగుతున్న చోట ఉదయం 6 నుంచి 11 గంటల్లోగా కూలీల వివరాలను నమోదు చేసుకుంటున్నారు.
మస్టర్ల వారీగా, చేస్తున్న పని వివరాలు ఫొటోక్యాప్చరింగ్ చేసి ఎన్ఎంఎంఎస్ యాప్‌లో అప్లోడ్ చేస్తున్నారు. మండలాల్లో ఏర్పాటు చేసిన ఉపాధి హామీ కార్యాలయంలోని సిస్టంలకు మేట్ల మొబైల్ నంబర్లు రిజిస్టరై ఉండడంతో కూలీల వివరాలు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నాయి. గతంలో పనుల వివరాలు, కూలీల హాజరు శాతం ఆన్లైన్లో ఎప్పటికప్పుడు నమోదు లేకపోవడంతో అవకతవకలు జరిగినట్లు సామాజిక తనిఖీ ప్రజావేదికల్లో వెల్లడైంది.
ఈ యేడు మాత్రం పనుల్లో పారదర్శకత కోసం ప్రభుత్వం పకడ్బందీగా ఎన్ఎంఎంఎస్ విధానాన్ని అమలు చేస్తుండడంతో పనులు పక్కాగా నడుస్తున్నాయి. కూలీల హాజరు శాతం తగ్గినా పనుల్లో మాత్రం పారదర్శకత ఉంటున్నది. గ్రామస్థాయిలో నియమితులైన టెక్నికల్ అసిస్టెంట్లు, మండల స్థాయిలో పనిచేస్తున్న ఏపీవోలు ఎప్పటికప్పుడు పని ప్రదేశాలను సందర్శిస్తూ అవకతవకలకు తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఫొటోక్యాప్చరింగ్ విధానంలో ఏఏ పనులు చేయిస్తున్నారన్నది తెలిసిపోతున్నది.
గ్రామాల్లో ఉపాధి హామీ పనులు పకడ్బందీగా చేయిస్తున్నాం. ఎన్ఎంఎంఎస్ విధానంలో ఎప్పటికప్పుడు కూలీల హాజరు, పనుల వివరాలు నమోదు చేయిస్తున్నాం. గ్రామస్థాయిలో తనిఖీలు చేయిస్తూ పనులు పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. అక్కడక్కడ మొబైల్ సిగ్నల్స్ లేకపోవడంతో ఫొటోక్యాప్చరింగ్ చేయడం కొంత ఇబ్బందిగా ఉంది. అయినా మేట్లు సిగ్నల్స్ ఉన్న ప్రదేశానికి వెళ్లి హాజరు శాతం నమోదు చేస్తున్నారు. 65 వేల మంది కూలీలు పనులకు వస్తున్నారు. సుమారు 37 వేల వరకు కూలీల వివరాలు ఫొటోక్యాప్చరింగ్ విధానంలో నమోదవుతున్నాయి.
– ఎస్ కిషన్, డీఆర్డీవో, ఆదిలాబాద్